భారీగా తగ్గిన బంగారం దిగుమతులు, 86 శాతం డౌన్
కరోనా మహమ్మారి - లాక్ డౌన్ కారణంగా గత మూడు నాలుగు నెలలుగా పసిడి దిగుమతులు పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి జూన్ నెలలో క్షీణించాయి. కేవలం 11 టన్నుల బంగారం మాత్రమే దిగుమతి చేసుకుంది ఇండియా. గత ఏడాది ఇదే జూన్ నెలలో 77.73 టన్నుల బంగారం దిగుమతి అయింది. అంటే 86 శాతం మేర క్షీణించింది. కరోనా కట్టడికి షట్ డౌన్ విధించడంతో ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు సహా అన్ని రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి.
మార్చి 25వ తేదీన లాక్ డౌన్ విధించినప్పటి నుండి దేశంలోను అన్ని వ్యాపార సంస్థలతో పాటు బంగారం దుకాణాలు కూడా క్లోజ్ అయ్యాయి. దీంతో రిటైల్ మార్కెట్లో బంగారు ఆభరణాల కొనుగోళ్లు పడిపోయాయి. ఈ రెండు కారణాల వల్ల దిగుమతులు భారీగా పడిపోయాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వ్యాల్యూ పరంగా కూడా గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే తగ్గిపోయింది. 2019 జూన్ నెలలో 2.7 బిలియన్ డాలర్ల బంగారం దిగుమతి చేసుకోగా, ఈసారి 608.76 టన్నులకు పరిమితమైంది.

గత కొంతకాలంగా బంగారం ధరలు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టాల్లో ఉండటం లేదా డైలమాలో ఉండటంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగాయి.