IT News: కరోనా తర్వాత కొత్త చిక్కులు.. కంపెనీల ఆ నిర్ణయంతో ఐటీ ఉద్యోగుల్లో గుబులు.. పీకేస్తారా..?
IT News: కరోనా సమయంలో మూడు పువ్వులు ఆరుకాయలు లాగా సాగిన ఐటీ ఉద్యోగుల ఆదాయం, ఆనందం ఇప్పుడు ఆవిరి అవుతున్నాయి. ఎందుకంటే కంపెనీలు వ్యాపారాలు మందగించటం వల్ల చాలా తక్కువ సంఖ్యలో రిక్రూట్ చేసుకుంటున్నాయి. పైగా ఇంతకు ముందు జాయిన్ అయిన వారి విషయంలోనూ చూస్తున్నాయి.

ఐదు అంకెల జీతం..
ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని తెలిసినప్పటికీ.. ఈ రోజుల్లో చాలా మంది ఐటీ కొలువులే కావాలని ఆశపడుతున్నారు. ఎందుకంటే అక్కడ జీతాలు వేలల్లో కాదు లక్షల్లో ఉండటమే. అయితే కరోనా సమయంలో అందరూ ఇళ్ల నుంచే పనిచేశారు. రిక్రూట్ మెంట్లు సైతం అలాగే జరిగాయి. ఈ సమయంలో భారీగా ఐటీ నియామకాలు జరిగిన సమయంలో చాలా మంది ఫేక్ ఎక్స్ పీరియనస్ తో కంపెనీల్లో చేరిపోయారు. ఇలా తప్పుడు సర్టిఫికెట్లు, తప్పుడు మార్గాల్లో కంపెనీల్లో చేరిన మారిపై ఇప్పుడు కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి.

కొత్త నియామకాలు క్రిటికల్..
కరోనా కాలంలో ఎక్కువ మంది ప్రాక్సీలను వినియోగించుకుని ఇంటర్వ్యూలను క్లియర్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు కంపెనీలు నియామకాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పైగా KPMG వంటి ప్రఖ్యాత సంస్థలకు కొత్త ఉద్యోగుల బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ బాధ్యతలను అప్పగిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను సైతం కంపెనీలు వెరిఫై చేయిస్తున్నాయి. ఇందులో తప్పుడు పద్ధతులు లేదా మార్గాల ద్వారా కంపెనీలోకి ప్రవేశించిన వారిని వెంటనే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలా చాలా మంది ఉద్యోగాలు కొల్పోయినట్లు సమాచారం.

అధికారులతో కుమ్మక్కై..
చాలా మంది కరోనా సమయంలో ఫేక్ మార్గాల్లో కంపెనీల్లో చేరటానికి హెచ్ ఆర్ మేనేజర్లు సైతం కారణమని సమాచారం. దీనిని అదునుగా తీసుకుని చాలా మంది మధ్యవర్తులు ఐటీ అభ్యర్ధుల నుంచి రెండు నెలల జీతాన్ని సైతం కమిషన్ రూపంలో తీసుకున్నారని తెలుస్తోంది. అయితే కంపెనీలు చర్యలు ప్రారంభించటంతో.. చాలా మంది అభ్యర్థులు ఇప్పుడు కంపెనీలకు రాజీనామాలు చేసి మరో కంపెనీకి మారిపోతున్నారు. మరికొందరి విషయంలో కంపెనీలు నోటీస్ పిరియడ్ ఇచ్చి ఇంటికి పంపుతున్నాయి.

పెరుగుతున్న భయాలు..
ఇప్పటికే ఐటీ కంపెనీల్లో మూన్ లైటింగ్ వ్యవహారం కారణంగా కంపెనీలు చాలా సీరియస్ గా ఉన్నాయి. తాజాగా విప్రో, డెలాయిట్ తో పాటు మరిన్ని ఐటీ సేవల కంపెనీలు తమ ఉద్యోగుల బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించే పనిలో పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న ఉద్యోగుల్లో భయాలు ప్రారంభం అయ్యాయి. కంపెనీల్లో ఉత్పాదకత తగ్గటానికి ఫేక్ ఉద్యోగులే కారణమని కంపెనీలు భావిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీకితి సహకరించిన వారి విషయంలోనూ కంపెనీ యాజమాన్యాలు నిర్ధయగా వ్యవహరిస్తున్నాయి.