పశ్చిమాసియా దేశాల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలపై ఈ వార్ కీలక ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాలు భారతదేశ ఐటీ సేవల రంగానికీ ప్రతికూల ప్రభావాలను తీసుకురావచ్చని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వెస్ట్ ఆసియా ప్రాంతం, అందులో భాగమైన మిడిల్ ఈస్ట్ & నార్త్ ఆఫ్రికా (MENA) ప్రాంతం గత కొన్నేళ్లుగా భారత ఐటీ సంస్థలకు కీలకమైన వృద్ధి అవకాశాల కేంద్రంగా మారింది.
మొత్తం ఆదాయంలో ఈ ప్రాంతం వాటా పెద్దది కాకపోయినా.. అమెరికా, యూరప్ వంటి సంప్రదాయ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా వ్యాపార విస్తరణకు ఇది కీలకంగా ఉపయోగపడుతోంది. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగితే.. ఈ ప్రాంతంలో వ్యాపార నిర్ణయాలు మందగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

యుద్ధ పరిస్థితుల కారణంగా గ్లోబల్ వ్యాపార వాతావరణంలో అనిశ్చితి పెరుగుతోంది. దాని ప్రభావంతో అనేక అంతర్జాతీయ సంస్థలు ఖర్చులపై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా డిస్క్రెషనరీ ఖర్చులు అంటే.. తక్షణ అవసరం లేని ఐటీ ప్రాజెక్టులు, డిజిటల్ మార్పిడి కార్యక్రమాలు, కొత్త టెక్నాలజీ పెట్టుబడులు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, యూరప్ మార్కెట్లలో ఆర్థిక మందగమనం కనిపిస్తున్న నేపథ్యంలో.. ఈ యుద్ధం ఐటీ రంగంపై అదనపు ఒత్తిడిని కలిగించవచ్చని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.
MENA ప్రాంతం నుంచి భారత ఐటీ సంస్థలకు వచ్చే ఆదాయం ప్రస్తుతం సుమారు 1-2 శాతం మాత్రమే అయినప్పటికీ.. అక్కడ ఏర్పాటు చేసిన డెలివరీ సెంటర్లు, ప్రాంతీయ కార్యాలయాలు, ప్రభుత్వ-ప్రైవేట్ ప్రాజెక్టులు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో TCS, Infosys, Wipro వంటి ప్రముఖ భారత ఐటీ కంపెనీలు అక్కడ కొనసాగిస్తున్న కార్యకలాపాలపై యుద్ధ పరిస్థితి ప్రభావం చూపే అవకాశముంది. భద్రతా పరిస్థితులు, క్లయింట్ నిర్ణయాలు, ప్రాజెక్టుల టైమ్‌లైన్లు అన్నీ మరింత జాగ్రత్తగా పునఃపరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం.. గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారత ఐటీ రంగ వృద్ధి రేట్లు తగ్గే అవకాశం ఉంది. గతంలో 5-7 శాతం వృద్ధి సాధ్యమని భావించిన చోట, ఇప్పుడు అది 4-5 శాతానికి పరిమితం కావచ్చని చెబుతున్నారు. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత ఐటీ సేవల వృద్ధి కేవలం 2-3 శాతం మధ్యే ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. దీని వల్ల కొత్త ప్రాజెక్టుల ప్రారంభం ఆలస్యం కావడం, క్లయింట్ నిర్ణయ ప్రక్రియలు నెమ్మదించడం వంటి ప్రభావాలు కనిపించవచ్చు.
మరోవైపు, ఈ యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదల రవాణా, ఉత్పత్తి, నిర్వహణ ఖర్చులను పెంచుతుంది. దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడటంతో పాటు, ఐటీ సంస్థల వ్యయ నిర్మాణాలపై కూడా పరోక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఉద్రిక్తతలు తాత్కాలికంగా పరిమితమైతే, దీర్ఘకాలికంగా భారత ఐటీ రంగానికి పెద్ద నష్టం జరిగే అవకాశం తక్కువ.
MENA ప్రాంతం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా అడుగులు వేస్తుండటంతో, భవిష్యత్తులో మళ్లీ పెట్టుబడులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. క్లుప్తంగా చూసుకున్నట్లయితే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం భారత ఐటీ రంగానికి తాత్కాలిక సవాళ్లను సృష్టించినప్పటికీ..మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉందని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications