వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రంపై పెరిగే వడ్డీ భారం ఎంతంటే?
కేంద్ర ప్రభుత్వం పైన వడ్డీ భారం వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా సామాన్యులకు అండగా నిలిచేందుకు ఉచిత రేషన్, ఉచిత గ్యాస్, వ్యాక్సినేషన్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. అదే సమయంలో రాబడి తగ్గింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రుణాలు పెరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ భారం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రూ.8.1 లక్షల FY23లో రుణాలు 15 శాతం పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. FY21లోని సవరణ కంటే ఇది 16.9 శాతం అధికం. వడ్డీ చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.1.20 లక్షల కోట్లు కేటాయించాలి. FY23లో వడ్డీ భారం రూ.9.30 లక్షల కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు.
వడ్డీ చెల్లింపుల కోసం వసూళ్ళలో FY12 బడ్జెట్‌లో 36.4 శాతం కేటాయించగా, FY22 నాటికి ఇది 42 శాతానికి పెరిగింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ డేటా ప్రకారం ప్రభుత్వం గత నవంబర్ వరకు రుణాలపై వడ్డీకి రూ.4.6 లక్షల కోట్లు చెల్లించింది. ప్రస్తుత సంవత్సరంలో వడ్డీ భారం 12 శాతం నుండి 15 శాతం పెరగవచ్చునని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ పేర్కొన్నారు.

ఆయిల్ బాండ్స్ వడ్డీ చెల్లింపులు, బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ బాండ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.29,281 కోట్లుగా ఉంటాయని అంచనా. గత యూపీఏ ప్రభుత్వం చమురు రంగ కంపెనీలకు ఆయిల్ బాండ్స్ జారీ చేసింది. ఇది కేంద్రానికి భారంగా మారింది. దీనికి గాను కేంద్రం రూ.9990 కోట్ల వడ్డీని ప్రతి ఏడాది చెల్లిస్తోంది. ఎన్డీఏ రూ.3.1 లక్షల కోట్ల బ్యాంకు రీక్యాపిటలైజేషన్ బాండ్స్‌ను విడుదల చేసింది. వీటికి రూ.19000 కోట్లు చెల్లిస్తోంది.