జపాన్, అమెరికా, చైనా కంటే భారత్‌లోనే శాలరీ హైక్ ఎక్కువ: పెరిగాయి.. పెరుగుతాయి
జపాన్, అమెరికా, చైనా, సింగపూర్, జర్మనీ, యూకేలతో సహా చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే శాలరీ పెంపు భారత్‌లో మెరుగ్గా ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. పై దేశాల్లో సగటు వేతనం పెరుగుదల 3.1 శాతం నుండి 5.5 శాతం మధ్య ఉండగా, భారత్‌లో మాత్రం 2020లో సగటు వేతన పెంపు 6.4 శాతంగా ఉందని సర్వే వెల్లడించింది. అంతేకాదు, ఈ సంవత్సరం వేతన పెంపు 7.7 శాతంగా ఉండవచ్చునని సర్వే వెల్లడించింది. టాప్ పర్ఫార్మర్స్ వేతన పెంపు 60 శాతం వరకు ఉండవచ్చునని ప్రముఖ కన్సల్టింగ్ కంపెనీ అయోన్ చేసిన శాలరీ ఇంక్రీస్ సర్వేలో వెల్లడైంది. ఈ నివేదిక మంగళవారం వచ్చింది.
LIC సరికొత్త 'బీమా జ్యోతి' ప్లాన్: కనీస పాలసీ రూ.1,00,000, ఎన్నో ప్రయోజనాలు...

1200 కంపెనీలపై సర్వే
2020లో బ్రిక్ దేశాలన్నింటిలోను భారత్‌లో వేతనాల పెంపు ఎక్కువగా ఉందని, ఈ ఏడాది కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటుందని ఈ సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా 20 పరిశ్రామికరంగాల్లోని 1,200 కంపెనీలపై చేసిన సర్వే ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు.
వ్యాపార కార్యకలాపాలపై కరోనా ప్రభావం ఏ మేరకు పడిందనే విషయమై పూర్తి అవగాహన వచ్చిన తర్వాత వేతనాల పెంపు అంశాన్ని కంపెనీలు పరిగణనలోకి తీసుకునే అవకాశముందని, అయితే పెంచిన వేతనం పూర్తిగా ఉద్యోగుల చేతికి ఇవ్వకుండా అందులో కొంత మొత్తాన్ని కొత్త వేతన నిర్వచనం ప్రకారం ఎక్కువ మొత్తంలో పీఎఫ్ కోసం ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని అయోన్ ఇండియా (పర్‌ఫెర్మాన్స్, ప్రోత్సాహకాల విభాగం) సీఈవో నితిన్ సేథి అన్నారు. ఈ సర్వేలో తేలిన మరిన్ని అంశాలు...

తగ్గిన ఆట్రిషన్ రేటు
2021లో వేతనాలను పెంచే ఉద్దేశ్యంలో ఉన్నట్లు 88 శాతం కంపెనీలు తెలిపాయి. 2020లో వేతనాల పెంపు వైపు మొగ్గు చూపిన కంపెనీలు 75 శాతం. ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుందని ఎక్కువ కంపెనీలు ఆశాజనకంగా ఉన్నాయని, ఇందుకు కంపెనీలు వేతనాల పెంపుకు మొగ్గు చూపుతుండటమే నిదర్శనమని అంటున్నారు. ఈ-కామర్స్, వెంచర్ క్యాపిటల్, హై-టెక్, ఐటీ టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో వేతనాల పెంపు ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది. ఆతిథ్యం, రెస్టారెంట్లు, స్థిరాస్తి, మౌలిక రంగాలు, ఇంజినీరింగ్ సేవల కంపెనీల్లో వేతనాల పెంపు తక్కువగా ఉండవచ్చునని సర్వే తెలిపింది.
ఆట్రిషన్ రేటు కూడా తగ్గింది. 2020లో ఇండియా ఇంక్ ఆట్రిషన్ రేటు 12.8 శాతంగా ఉంది. 2019లో ఇది 16.1 శాతంగా ఉంది. సర్వీస్ సెక్టార్‌లో ఇది 14.5 శాతంగా ఉంది. 2019లో 20.7 శాతంగా ఉంది. ఉద్యోగం మారేందుకు ఉద్యోగులు ఆచితూచి వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

బ్రిక్స్ దేశాల్లో భారత్ అదుర్స్
2020లో లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నప్పటికీ బ్రిక్స్ దేశాలన్నింటిలో భారత్‌లో అత్యధిక వేతనాల పెంపు ధోరణి కొనసాగవచ్చునని తెలిపింది. తమ బిజినెస్ వృద్ధి పెగవచ్చునని 60 శాతం కంపెనీలు తెలిపాయి. అందుకే 2021లో పే హైక్ సగటున 9.1 శాతం ఉంటుందని కొన్ని సంస్థలు వెల్లడించాయి. బిజినెస్ క్రమంగా వృద్ధి సాధిస్తుందని 93.5 శాతం మంది తెలిపారు.