FY21లో దేశీయ విమాన రంగానికి రూ.21,000 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ రూ.21,000 కోట్లకు పైగా నష్టాలను నమోదు చేసే అవకాశముందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా లిమిటెడ్ గురువారం వెల్లడించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి చివరి వారం నుండి దాదాపు రెండు నెలలు విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత ప్రారంభమైనప్పటికీ పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రంగానికి భారీ నష్టం వాటిల్లనుందని పేర్కొంది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి ఇండియన్ ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీకి FY2021 నుండి FY2023 మధ్య రూ.37,000 కోట్లకు పైగా ఫండ్ అవసరమని అభిప్రాయపడింది.

కార్యకలాపాలపై ప్రభావం
కరోనా కారణంగా భారత విమానరంగంపై భారీ ప్రభావం పడిందని ఇక్రా తెలిపింది. మార్చి 23వ తేదీ నుండి అంతర్జాతీయ ప్రయాణ కార్యకలాపాలు నిలిచిపోయాయని, మార్చి 25 నుండి దేశీయ విమాన కార్యకలాపాలు నిలిచిపోయాయని గుర్తు చేసింది. 2020 మే 25వ తేదీ నుండి పరిమితంగా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని, ఆ తర్వాత 45 శాతం కెపాసిటీతో అనుమతించారని, సెప్టెంబర్ నుండి 60 శాతం అమలులోకి వచ్చిందని గుర్తు చేసింది. నవంబర్ 11వ తేదీ నుండి 70 శాతం, డిసెంబర్ 3 నుండి 80 శాతం అనుమతించారని తెలిపింది.

రూ.50వేల కోట్లకు రుణం
కరోనా కారణంగా కార్యకలాపాలు నిలిచిపోవడం, ప్రయాణాలు తగ్గడం వంటి వివిధ కారణాలతో భారీగా నష్టం వాటిల్లనుందన ఇక్రా తెలిపింది. FY2020లో ఇండియన్ ఎయిర్ లైన్స్ రూ.12,700 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. 2022 ఆర్థిక సంవత్సరానికి లీజు బాధ్యతలను మినహాయించి మొత్తం విమాన పరిశ్రమ రుణం దాదాపు రూ.50వేల కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఇక్రా పేర్కొంది. ఇండిగో, స్పైస్ జెట్ విమాన సంస్థలు FY2021 మొదటి అర్ధ సంవత్సరంలో రూ.31 కోట్ల నష్టాలను రిపోర్ట్ చేశాయి.

ప్రయాణీకుల రద్దీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రయాణీకుల రద్దీ 62 శాతం నుండి 64 శాతం తగ్గవచ్చునని అంచనా వేసింది. అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 88 శాతం నుండి 89 శాతం తగ్గవచ్చునని పేర్కొంది. 2020-21లో తక్కువ ప్రాతిపదికన కారణంగా 2021.22లో దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాల వృద్ధి చాలా బలంగా కనిపించవచ్చునని చెబుతున్నారు.