2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటాం, ఎలా ఎదిగామంటే: అమిత్ షా
ముంబై: 2024 నాటికి భారత ఆర్థిక ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ముంబైలో ఎకనామిక్ టైమ్స్ అవార్డ్ 2019 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రపంచంలోని 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందన్నారు.
ప్రయాణీకులకు ఆర్టీసీ షాక్, ఛార్జీల పెంపు: కి.మీ.కు ఎంత

అయిదేళ్లలో ఇలా ఎదిగిపోయాం...
ఇప్పటికే విదేశీ కంపెనీలకు భారత్ ఓ ప్రధాన కేంద్రంగా ఉందని అమిత్ షా అన్నారు. ప్రస్తుతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డు స్థాయిలో ఉన్నాయని చెప్పారు. 2014లో 2 లక్షల కోట్ల డాలర్లతో 11వ స్థానంలో ఉన్న భారత జీడీపీ ఇప్పుడు 2.9 లక్షల కోట్ల డాలర్లతో 7వ స్థానంలోకి చేరుకుందని గుర్తు చేశారు. 2024 నాటికి కచ్చితంగా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఇలా...
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కూడా 2024 నాటికి భారత్ టాప్ 30లోకి చేరుకుంటుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 2014లో భారత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 142వ స్థానంలో ఉందని, అయిదేళ్లలోనే 77వ ర్యాంకుకు చేరుకుందని చెప్పారు. 2024 నాటికి కచ్చితంగా 30వ ర్యాంకుకు చేరుకుంటామని చెప్పారు.

బలమైన లీడర్ నేతృత్వంలో...
నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత ఎకానమీ, మార్కెట్లు మరింత బలంగా మారుతున్నాయని అమిత్ షా అన్నారు. మోడీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాల వల్ల ఇది సాధ్యమవుతోందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బట్టి మన వద్ద కూడా మందగమనం ఉందన్నారు. కానీ 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రయివేటు సెక్టార్ పైన ఉందన్నారు.