ట్రంప్ చూసేది విభిన్న భారత్, మూడో ఆర్థిక వ్యవస్థగా దేశం: సత్య నాదెళ్లతో ముఖేష్ అంబానీ
ఇండియా ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే దశలో ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. అలాగే, ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముంబైలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో నిర్వహించిన ఫ్యూచర్ డీకోడెడ్ సీఈవో సదస్సులో మాట్లాడారు.

ఆ కారణం వల్లే
భారత్ ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే దిశగా ఎదగడానికి కారణం మొబైల్ నెట్ వర్క్ విపరీతంగా పెరగడంతో పాటు గతంలో ఎన్నడూ చూడనంత వేగంగా విస్తరించడం వల్లేనని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ 2014లో ప్రారంభించిన డిజిటల్ ఇండియా వల్ల ఇది సాధ్యమవుతోందన్నారు. అప్పటి నుండే ఇది ప్రారంభమైందన్నారు.

జియో వేగం ఎంతంటే..
380 మిలియన్ల మంది ప్రజలు రిలయన్స్ జియో 4G టెక్నాలజీ వైపు మరలినట్లు ముఖేష్ అంబానీ వెల్లడించారు. ప్రీ జియో డేటా స్పీడ్ 256Kbps కాగా, పోస్ట్ జియో వేగం 21Mbpsగా ఉందని తెలిపారు.

ట్రంప్ పర్యటన.. భిన్నమైన భారత్
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనపై కూడా ముఖేష్ అంబాని స్పందించారు. గతంలో నాటి అమెరికా అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామాలు చూసిన భారతదేశం కంటే ఇప్పుడు ట్రంప్ చూసే భారత్ భిన్నంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అతి కీలకమైన మార్పులో మొబైల్ కనెక్టివిటీ అన్నారు.

తొలి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారత్..
ప్రపంచంలోని తొలి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఉంటుందని, అందులో తనకు ఎలాంటి సందేహం లేదని ముఖేష్ అంబానీ అన్నారు. అయితే ఇది ఐదేళ్లలో సాధ్యమా లేక పదేళ్లలో సాధ్యమా అన్నదే ఇప్పుడు చర్చ అన్నారు. ప్రస్తుతం టాప్ 2లో అమెరికా, చైనా ఉన్నాయి. ఆ తర్వాత స్థాయికి భారత్ ఎదుగుతుందని ముఖేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మీరు, నేను చూసిన దానికంటే విభిన్న భారత్
భారత్ ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా మారేందుకు మంచి అవకాశముందని ముఖేష్ అంబానీ చెప్పారు. మీరు (సత్య నాదెళ్ల) చూసిన దాని కంటే, అలాగే నేను పెరిగిన వాతావరణం కంటే విభిన్నమైన భారతాన్ని వచ్చే తరం చూడబోతుందని ముఖేష్ అంబానీ అన్నారు.