For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కంపెనీల్లో అవకతవకలు.. పెరుగుతోన్న స్వతంత్ర డైరెక్టర్ల రాజీనామాలు!

|

దేశీయ కార్పొరేట్ రంగంలో స్కామ్‌లు, దివాలాలు పెరిగిపోతున్నాయి. పెద్దా, చిన్నా తేడా లేకుండా ఈ ఏడాది పలు కంపెనీలలో అనేక అవకతవకలు, కుంభకోణాలు బయటపడ్డాయి. దీంతో ఈ స్కామ్‌ల పాపం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో ఆయా కంపెనీల్లో స్వతంత్ర డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారు రాజీనామా చేసేస్తున్నారు.

గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో 126 మంది స్వతంత్ర డైరెక్టర్లు రాజీనామా చేయగా ఈ ఏడాది మొదటి 6 నెలల్లో ఈ సంఖ్య 291కి చేరింది. ఈ వివరాలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛచేంజ్(ఎన్ఎస్ఈ), ప్రైమ్ డేటాబేస్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన 'ఎన్ఎస్ఈ ఇన్ఫోబేస్ డాట్‌కామ్' వెల్లడించింది.

స్వతంత్ర డైరెక్టర్లు ఎవరంటే...

స్వతంత్ర డైరెక్టర్లు ఎవరంటే...

సాధారణంగా ఒక కంపెనీ డైరెక్టర్ల బోర్డులో మూడో వంతు ఇండిపెండెంట్(స్వతంత్ర) డైరెక్టర్లు ఉంటారు. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన కంపెనీల్లో అయితే మొత్తం డైరెక్టర్లలో మూడు నుంచి ఐదో వంతు వరకు స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి. ఇక టాప్ 1000 కంపెనీల్లో ఉండే స్వతంత్ర డైరెక్టర్లలో కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉండాలి. వీరికి అధికారాలు కూడా పరిమితంగానే ఉంటాయి. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లలా కంపెనీ రోజువారీ కార్యకలాపాలను చూడాల్సిన అవసరం ఉండదు. అయితే బోర్డు సమావేశాలకు హాజరవుతూ కంపెనీ కార్యకలాపాల వివరాలను తెలుసుకుంటూ ఉండాలి.

స్వతంత్ర డైరెక్టర్ల బాధ్యతలేమిటి?

స్వతంత్ర డైరెక్టర్ల బాధ్యతలేమిటి?

కంపెనీకి సంబంధించిన రహస్యాలను, నిర్ణయాలను వీరు లీక్ చేయకూడదు. అలాగే బోర్డు నియమించే కమిటీల్లో సభ్యుడిగా ఉంటూ.. ఆ కమిటీ సమావేశాలకూ హాజరుకావలసి ఉంటుంది. స్వలాభం కోసం తమ హోదాను దుర్వినియోగం చేయడం, కంపెనీకి నష్టం కలిగించడం వంటివి చేయకూడదు. కంపెనీలో అవకతవకలు ఏవైనా చోటుచేసుకుంటే స్వతంత్ర డైరెక్టర్లు వాటిని దాచిపెట్టకుండా బహిర్గతం చేయాలి. వీరిని కంపెనీ బోర్డు నుంచి తొలగించేందుకు ఒక ప్రత్యేక తీర్మానం చేయాల్సి ఉంటుంది.

 కంపెనీ ప్రమోటర్ల దయపైనే...

కంపెనీ ప్రమోటర్ల దయపైనే...

నిజానికి భారత్‌లో పలు కంపెనీలు ఇప్పటికీ కుటుంబాల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అంటే, ప్రమోటర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అందరూ ఆ కుటుంబ సభ్యులే ఉంటారు. ఆయా కంపెనీల్లో స్వతంత్ర డైరెక్టర్ల నియామకం, కొనసాగింపు అనేది పూర్తిగా ప్రమోటర్ల దయపైనే ఆధారపడి సాగుతోంది. దీంతో కంపెనీలో అవకతవకలు చోటుచేసుకున్నా వీరు ప్రమోటర్లకు వ్యతిరేకంగా తమ గళం విప్పలేని పరిస్థితి. ఒకరకంగా చెప్పాలంటే వీరు కంపెనీలో ఉత్సవ విగ్రహాలే.

ఆ తరువాతే.. నిబంధనలు కఠినం

ఆ తరువాతే.. నిబంధనలు కఠినం

సత్యం కంప్యూటర్స్ స్కామ్ వెలుగులోకి వచ్చేంత వరకు కంపెనీల్లో స్వతంత్ర డైరెక్టర్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. ఆ స్కామ్ తరువాత ప్రభుత్వం 2013 నాటి కంపెనీల చట్టంలో స్వతంత్ర డైరెక్టర్లకు సంబంధించిన నిబంధనల్లో పలు మార్పులు చేర్పులు చేసింది. కంపెనీ అవకతవకల విషయం తెలిసి కూడా స్పందించకపోతే, వీరి ఆస్తులను కూడా కంపెనీల వ్యవహారాల శాఖ స్తంభింపజేసే అవకాశాలున్నాయి.

రాజీనామాలకు కారణాలివే...

రాజీనామాలకు కారణాలివే...

ఇటీవల ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఇబ్బందులు తలెత్తగానే పలువురు స్వతంత్ర డైరెక్టర్లు రాజీనామా చేశారు. చెల్లింపుల్లో విఫలం కావడంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ నుంచి కూడా పలువురు స్వతంత్ర డైరెక్టర్లు వైదొలిగారు. ప్రస్తుతం కంపెనీల బోర్డుల నుంచి వైదొలుగుతున్న స్వతంత్ర డైరెక్టర్లలో సగం మంది వారి పదవీకాలం ముగియడంతో రాజీనామా చేస్తున్నారు. కొంతమంది ఆరోగ్యం సహకరించకపోవడం, ఇతర వ్యక్తిగత కారణాలు, ఇతర వృత్తులు, వ్యాపకాలలో స్థిరపడడం కోసం తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రథమార్థంలోనే 291 మంది...

ఈ ఏడాది ప్రథమార్థంలోనే 291 మంది...

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల కాలంలో మొత్తం 291 మంది స్వతంత్ర డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో 146 మంది తమ పదవీ కాలం పూర్తికావడం వల్ల రాజీనామా చేయగా.. మళ్లీ ఆ పదవిలో కొనసాగడం ఇష్టం లేదంటూ 36 మంది తమ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇక ఇతర వృత్తుల్లో స్థిరపడేందుకు రాజీనామా చేసిన వారు 26 మంది. మరో 17 మంది సెబీ, కంపెనీల చట్టం ప్రకారం తగిన అర్హత లేక వైదొలగారు. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు, పదవిపై ఆసక్తి లేదంటూ 40 మంది స్వతంత్ర డైరెక్టర్లు రాజీనామా సమర్పించారు. కంపెనీ యాజమాన్యం మారిన దరిమిలా 6 మంది రాజీనామా సమర్పించారు.

 స్వతంత్ర డైరెక్టర్ పదవా.. అమ్మో!

స్వతంత్ర డైరెక్టర్ పదవా.. అమ్మో!

గతంలో ఇతర కంపెనీల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పని చేసిన వాళ్లు, ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పదవులు నిర్వహించిన వాళ్లు ప్రస్తుతం ‘స్వతంత్ర డైరెక్టర్' పదవి అనగానే.. ఇష్టపడడం లేదు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికెరుక అన్నట్లు.. ఏ కంపెనీలో ఎలాంటి అవకతవకలు ఉన్నాయో అనే భయంతో ఆ పదవిని చేపట్టేందుకు ఉత్సాహం ప్రదర్శించడం లేదు. కారణం.. ఏమైనా అవకతవకలు జరిగితే.. సదరు కంపెనీ ప్రమోటర్లు, బోర్డు యాజమాన్యం తీసుకునే నిర్ణయాలకు తాము బలి అవుతామేమో అనే భయం. ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే అప్పటివరకు ఉన్న తమ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడమేకాక.. న్యాయ వివాదాలు కూడా ఎదుర్కొనవలసి వస్తుందని, అందుకే ఈ పదవికి దూరంగా ఉంటున్నామని పలువురు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

English summary

కంపెనీల్లో అవకతవకలు.. పెరుగుతోన్న స్వతంత్ర డైరెక్టర్ల రాజీనామాలు! | independent directors resignations doubled in 2019

The number of independent directors who resigned from board positions doubled in 2019, compared with total exits in the previous two years, as greater liability, rising number of corporate governance cases, increasing fear of fraud risk and chances of personal reputation being at stake led to the exodus.
Story first published: Friday, December 27, 2019, 18:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X