బాదుడు కంటిన్యూస్: వాటి రేట్లల్లో భారీగా పెరుగుదల
న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరల్లో యధాతథ స్థితి కొనసాగుతోంది. 40 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగట్లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకదశలో క్రూడాయిల్ ధర సైతం భారీగా పెరిగినా.. దాని ప్రభావం దేశీయ ఇంధన విక్రయాలపై పడలేదు. ఇది సామాన్యులకు కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైన తొలి రోజుల్లో 140 డాలర్ల వరకు వెళ్లిన క్రూడాయిల్ బ్యారెల్ ప్రైస్..ఆ తరువాత తగ్గుతూ వచ్చింది. 90 నుంచి 100 డాలర్ల మధ్యలో ఉంటూ వచ్చింది.
LIC, Paytm: ఇన్వెస్టర్లకు రక్తకన్నీరే: మునిగిన రూ.వేల కోట్లు
పెట్రోల్, డీజిల్ ధరల్లో యధాతథ స్థితిని కొనసాగిస్తోన్న కేంద్ర ప్రభుత్వం- దీనికి ప్రత్యామ్నాయంగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, పైప్డ్ నేచురల్ గ్యాస్, గృహావసర-వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల రేట్లను పెంచుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ రేటును పెంచిన మరుసటి రోజే- సీఎన్జీ బాదుడుపై దృష్టి సారించింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సీఎన్జీ రేటును పెంచింది. ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి.

న్యూఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్, దానికి ఆనుకుని ఉండే ప్రాంతాలకు సరఫరా చేసే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరను సవరించినట్లు ప్రకటించిందా కంపెనీ. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు అనుబంధంగా పని చేసే సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. కిలో సీఎన్జీపై రెండు రూపాయలను పెంచినట్లు ప్రకటించింది. దీనితో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.75.61 పైసలకు చేరింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లల్లో రూ.78.17 పైసలు పలుకుతోంది.
గుర్‌గావ్‌లో దీని రేటు మరింత అధికంగా ఉంది. కేజీ సీఎన్జీ 83.94 పైసలకు చేరింది. రెవారి-రూ.86.07 పైసలు, కర్నల్, కైథల్-రూ.84.27 పైసలుగా ఉంది. కాన్పూర్, హమీర్‌పూర్, ఫతేపూర్‌లల్లో రూ.87.40 పైసలు, అజ్మీర్, పాలి, రాజ్‌సమంద్‌లల్లో రూ.85.88 పైసలుగా రికార్డయింది. ముంబైకి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌ను సరఫరా చేస్తోన్న మహానగర్ గ్యాస్ లిమిటెడ్.. కిందటి నెలలో ధరను పెంచిన విషయం తెలిసిందే. కిలో ఒక్కింటికి నాలుగు రూపాయల మేర సవరించింది.