పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..
భారతదేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం ఇప్పుడు కేవలం ఆభరణాల మార్కెట్‌కే పరిమితం కాకుండా.. బంగారు రుణ రంగాన్ని కూడా గణనీయంగా ప్రభావితం చేస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దేశంలో బంగారు రుణ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆశ్రయించే మార్గంగా ఉన్న బంగారు రుణాలు, ఇప్పుడు వ్యూహాత్మక ఆర్థిక ప్రణాళికలో కీలక భాగంగా మారాయి.
ముత్తూట్ ఫిన్‌కార్ప్, జెఫరీస్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. భారతదేశంలోని బంగారు రుణ మార్కెట్ నవంబర్ 2025 నాటికి సంవత్సరానికి సుమారు 42 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 15.6 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేయబడుతోంది. ఈ వృద్ధి వెనుక ప్రధాన కారణం Gold ధరల పెరుగుదలతో పాటు, రుణాలపై వినియోగదారుల దృక్పథంలో వచ్చిన మార్పుగా నిపుణులు చెబుతున్నారు.

ప్రత్యేకంగా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి తీసుకునే రిటైల్ రుణాలు ఏకంగా 93 శాతం పెరిగాయి. బ్యాంకులు మంజూరు చేస్తున్న Gold రుణాల పరిమాణం మరింత వేగంగా పెరిగి 127 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది బంగారు రుణాలపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది. బంగారం ధరలు పెరగడం వల్ల అదే ఆభరణాలపై గతంతో పోలిస్తే ఎక్కువ రుణం లభించడం కూడా ఈ డిమాండ్ పెరుగుదలకు కారణంగా మారింది.
ఇప్పుడు గృహాలు, చిన్న వ్యాపారాలు (MSMEలు), దుకాణదారులు, రైతులు బంగారు రుణాలను చివరి ప్రయత్నంగా కాకుండా, నగదు ప్రవాహాన్ని నిర్వహించడానికి ఒక ప్రణాళికాబద్ధమైన మార్గంగా ఉపయోగిస్తున్నారు. వ్యాపార అవసరాలు, సీజనల్ ఖర్చులు, సాగు పెట్టుబడులు వంటి అవసరాలకు బంగారు రుణాలు కీలకంగా మారాయి. అలాగే, ఇంటి ఖర్చులు పెరగడం, పిల్లల విద్యా వ్యయాలు, వైద్య ఖర్చులు వంటి కారణాలతో కూడా కుటుంబాలు ఈ రుణ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.
బంగారు రుణాల ప్రధాన ఆకర్షణల్లో ఒకటి వీటిని త్వరగా పొందగలగడం. ఇతర రుణాలతో పోలిస్తే కాగితపు పనులు తక్కువగా ఉండటం, తక్కువ సమయంలో ఆమోదం లభించడం వల్ల అత్యవసర నగదు అవసరాల కోసం ఇవి అనుకూలంగా మారాయి. అంతేకాదు రుణం పూర్తిగా చెల్లించిన వెంటనే ఆభరణాలు తిరిగి పొందే అవకాశం ఉండటంతో ప్రమాదం తక్కువగా ఉంటుందని వినియోగదారులు భావిస్తున్నారు. ఈ కారణంగా, బంగారం అమ్మకుండా తాకట్టు పెట్టడం ద్వారా తమ పొదుపును కాపాడుకోవచ్చనే అవగాహన పెరిగింది.
గతంలో చాలా మంది అనధికారిక వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లి అధిక వడ్డీలతో రుణాలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పారదర్శకత, కస్టమర్ రక్షణ, స్పష్టమైన నిబంధనలు అందుబాటులో ఉండటంతో ప్రజలు NBFCలు, బ్యాంకుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది బంగారు రుణ రంగం మరింత వ్యవస్థీకృతంగా ఎదగడానికి దోహదపడుతోంది.
ఈ నివేదిక మరో ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావించింది. భారతీయ గృహాల్లో భారీగా ఉపయోగంలో లేని బంగారం నిల్వగా ఉందని పేర్కొంది. ఈ బంగారాన్ని ఆర్థిక అవసరాలకు వినియోగించుకోవాలనే ఆలోచన పెరుగుతున్నందున.. బంగారు రుణాల పరిధి వేగంగా విస్తరిస్తోంది. మొత్తంగా, పెరుగుతున్న బంగారం ధరలు బంగారు రుణ రంగానికి సవాలుగా కాకుండా, అవకాశంగా మారాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications