ఆస్ట్రేలియా ఐటీ దిగ్గజం HCL టెక్ హస్తగతం, షేర్లు భారీగా జంప్
ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ ధర నేడు (మంగళవారం, జనవరి 5) భారీగా ఎగిసింది. నిన్న రూ.980 వద్ద ముగిసిన షేర్ నేడు ప్రారంభ సెషన్లో రూ.992 క్రాస్ చేసి, రూ.వెయ్యి దిశగా కనిపించింది. మధ్యాహ్నం గం.1.00 సమయానికి స్టాక్ 0.76 శాతం లేదా రూ.7.50 శాతం ఎగిసి రూ.988 వద్ద ట్రేడ్ అయింది. ఇటీవల ఐటీ రంగం భారీగా లాభాలు ఇస్తున్న విషయం తెలిసిందే. నేడు ఐటీ సెక్టార్ ఒక శాతానికి పైగా లాభాల్లో ఉంది. అయితే హెచ్‌సీఎల్ టెక్ దిగ్గజం మెరవడానికి మరో కారణం కూడా ఉంది.

కొనుగోలు పూర్తయింది
ఆస్ట్రేలియా ఐటీ సర్వీసుల దిగ్గజం DWS కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రకటించింది. ఈ రోజు నుండి DWS పూర్తిస్థాయి కార్యకలాపాలు తమ చేతిలోకి వచ్చినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ ఐటీ సంస్థ తెలిపింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్ల ఐటీ సేవలు అందించే ప్రముఖ కంపెనీ DWS. ఈ సంస్థను కొనుగోలు చేయనున్నట్లు గత ఏడాది సెప్టెంబర్ నెలలో హెచ్‌సీఎల్ ప్రకటించింది.

షేర్ హోల్డర్లకు డివిడెండ్
ఈ కొనుగోలు ఒప్పంద విలువ 158.2 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు. భారత కరెన్సీలో రూ.850 కోట్లకు పైగా. కంపెనీలోని 131.83 మిలియన్ షేర్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వశమయ్యాయి. DWSలోని షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుకు 0.03 ఆస్ట్రేలియన్ డాలర్ల డివిడెండ్ చెల్లించనున్నట్లు కూడా హెచ్‌సీఎల్ తెలిపింది.

700 మంది ఉద్యోగులు
DWSలో 2020లో సంవత్సరానికి 167.9 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. మెల్బోర్న్, సిడ్నీ, అడిలైడ్, బ్రిస్బేన్, కాన్‌బెర్రా నగరాల్లో ఈ కంపెనీకి కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం 700 మందికిపైగా ఉద్యోగస్తులు ఉన్నారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, అప్లికేషన్ డెవలప్‌మెంట్, సపోర్ట్, ప్రోగ్రాం, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్, కన్సల్టేంగ్ సేవలను అందిస్తోంది. హెచ్‌సీఎల్‌కు కాన్‌బెర్రా, సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, పెర్త్ వంటి నగరాల్లో 1600 మంది ఉద్యోగులు ఉన్నారు.