ఎల్ఐసీ షేర్ భారీ క్షీణతపై ఆందోళన, ప్రభుత్వం ఏమన్నదంటే
ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) స్టాక్ ధర దారుణంగా పతనమైన విషయం తెలిసిందే. లిస్టింగ్ నుండి ఈ స్టాక్ కుప్పకూలుతూనే ఉంది. ఇష్యూ ధరతో పోలిస్తే 25 శాతం వరకు క్షీణించింది. ఈ స్టాక్ కొనుగోలుదారులు ఈ మూడు వారాల్లోనే రూ.1.5 లక్షల కోట్ల మేర నష్టపోయారు. ఎన్నో ఆశలతో వచ్చిన ఎల్ఐసీ ఇన్వెస్టర్ల ఆశలను నీరుగార్చింది.
ఎల్ఐసీ తాత్కాలిక క్షీణత పైన ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూనే, ఇది స్వల్పకాలం మాత్రమేనని అభిప్రాయపడింది. బీమా సంస్థ యాజమాన్యం అన్ని అంశాలను పరిశీలించి, వాటాదారుల వ్యాల్యూను పెంచే దిశగా చర్యలు చేపడుతుందని పేర్కొంది. 'ఎల్ఐసీ స్టాక్ తాత్కాలిక క్షీణతపై ఆందోళన చెందుతున్నాం. ప్రజలు ఎల్ఐసీ ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటుంది. యాజమాన్యం అన్ని అంశాలను పరిశీలించి, వాటాదారుల వ్యాల్యూను పెంచుతుంది' అని దీపమ్ సెక్రటరీ తుహిన్ కాంత పాండే అన్నారు.

ఎల్ఐసీ రూ.949 ఇష్యూ ధరతో రాగా, మే 17వ తేదీన భారీగా పడిపోయి రూ.872 వద్ద వద్ద లిస్ట్ అయింది. ఎల్ఐసీ ఐపీవోలో మూడు రెట్ల ఓవర్ సబ్‌స్క్రిప్షన్ జరిగింది. కానీ లిస్టింగ్, లిస్టింగ్ తర్వాత మాత్రం ఎల్ఐసీ కుప్పకూలింది.
ఎల్ఐసీ స్టాక్ మాత్రం చివరి సెషన్లోను 2 శాతానికి పైగా క్షీణించింది.
టాటా మోటార్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.53 లక్షల కోట్లుగా ఉంది. ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ కూడా లిస్టింగ్ నుండి ఇప్పటి వరకు దాదాపు రూ.1.42 లక్షల కోట్ల మేర క్షీణించింది. అంటే దాదాపు టాటా మోటార్స్ మార్కెట్ వ్యాల్యుయేషన్ అంత ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ తగ్గింది. ఎల్ఐసి ఇరవై రోజుల క్రితం లిస్ట్ అయింది. ఎల్ఐసీ ఇష్యూ ధర రూ.949 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.709 స్థాయికి పడిపోయింది.