ఎయిర్‌టెల్‌లో గూగుల్ భారీ పెట్టుబడులు: వందల్లో కాదు..వేల కోట్లల్లో
ముంబై: టాప్ సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్‌టెల్ నక్కతోక తొక్కినట్లుంది. ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ భారతీ ఎయిర్‌టెల్‌లో పెట్టుబడులు పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ అనేది అసాధారణంగా, అంచనాలకు అందని విధంగా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అదే జరిగితే- ఇప్పటిదాకా గూగుల్ ఇన్వెస్ట్ చేసిన రెండో అతి పెద్ద కంపెనీగా భారతి ఎయిర్‌టెల్ ఆవిర్భవిస్తుందని అంటున్నారు.
ప్రస్తుతం పెట్టుబడులకు సంబంధించినంత వరకూ ఈ రెండు బిగ్ షాట్స్ మధ్య పలు విడతల్లో చర్చలు ముగిశాయని తెలుస్తోంది. తుది దఫా చర్చలను చేపట్టాల్సి ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. పెట్టుబడులను పెట్టే విషయంలో బహుశా- అవే చివరి చర్చలు కావొచ్చని అభిప్రాయడుతున్నాయి. ఏడాది కాలంగా గూగుల్ మేనేజ్‌మెంట్- భారతి ఎయిర్‌టెల్ మధ్య పెట్టుబడులకు సంబంధించిన డిస్కషన్స్ విస్తృతంగా సాగాయని కొన్ని బిజినెస్ న్యూస్ పోర్టల్స్ సైతం పేర్కొంటోన్నాయి.

అంచనాలకు అందని విధంగా అంటే- భారతి ఎయిర్‌టెల్‌లో గూగుల్ మేనేజ్‌మెంట్ పెట్టబోయే ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూమ్ వందల్లో కాదు.. వేల కోట్ల రూపాయల్లో ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. నిజానికి గూగుల్ యాజమాన్యం- దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబాని సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన జియోలో పెట్టుబడులు పెట్టాలని భావించిన విషయం తెలిసిందే. ఈ దిశగా పలు దఫాలుగా చర్చలు సాగాయి.
లెటర్ టు ఇన్వెస్ట్ విషయంలో రిలయన్స్ జియో యాజమాన్యం గూగుల్ మేనేజ్‌మెంట్‌కు కొన్ని ఆంక్షలు, నిబంధనలను విధించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తన ప్రత్యర్థి సర్వీస్ ప్రొవైడర్లయిన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదనే నిబంధనను రిలయన్స్ జియో విధించినట్లు తెలుస్తోంది. దీని తరువాత కూడా గూగుల్ మేనేజ్‌మెంట్.. జియో ప్లాట్‌ఫామ్స్‌పై 34,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టింది.
అయినప్పటికీ- ఏడాదికాలంగా భారతి ఎయిర్‌టెల్ యాజమాన్యంతో చర్చలు జరుపుతోన్నందు వల్ల అందులో ఇన్వెస్ట్ చేయడానికే మొగ్గు చూపిందని అంటున్నారు. 4జీ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని ఇప్పుడున్న దాని కంటే మరింత పెంచడానికి భారతి ఎయిర్‌టెల్ యాజమాన్యం కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. దీనికోసం బయటి సంస్థల నుంచి పెట్టుబడుల కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. తాజాగా- గూగుల్ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉండటం వల్ల ఇక 4జీతో పాటు 5జీ నెట్‌వర్క్‌ను కూడా అందుబాటులోకి తెస్తుందని సమాచారం.