భారతీయ మహిళలకు గూగుల్ గుడ్ న్యూస్.... మహిళా దినోత్సవం రోజున సుందర్ పిచాయ్ కీలక ప్రకటన...
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ భారతీయ మహిళల కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటించింది. భారత్‌లో 10లక్షల మంది గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతను అందించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం 25 మిలియన్ డాలర్ల ఇంపాక్ట్ ఫండ్‌ను ప్రకటించడం విశేషం. మహిళా దినోత్సవం సందర్భంగా గూగుల్ నిర్వహించిన 'ఈవెంట్ విమెన్ విల్' వర్చువల్ సమావేశంలో ఆ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ఈ వివరాలు వెల్లడించారు.
ఈ సమావేశంలో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ... 'కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మహిళా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం దాదాపు రెండు రెట్లు పెరిగింది. దాదాపు 2 కోట్ల మంది బాలికలు మళ్లీ స్కూల్‌కు వెళ్లలేని దుస్థితి నెలకొంది.' అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహిళా చేయూతకు గూగుల్ ముందుకు వచ్చినట్లు చెప్పారు.

దేశంలోని 10 లక్షల మంది గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత అందించనున్నట్లు తెలిపారు. అలాగే నాస్కామ్ ద్వారా బిహార్,హిమాచల్ప్ర దేశ్,రాజస్తాన్,హర్యానా,ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని మహిళా రైతులకు డిజిటల్&ఫైనాన్షియల్ లిటరసీని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం నాస్కామ్‌కు 5లక్షల డాలర్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.
త్వరలోనే గూగుల్ సెర్చ్&మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను చేర్చనున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. మహిళల నేత్రుత్వంలో నడిచే వ్యాపారాలు,పరిశ్రమలు,ఔట్‌లెట్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.ముఖ్యంగా మహిళలు నడిపే రెస్టారెంట్లు,వారి ఆధ్వర్యంలో నడిచే బట్టల దుకాణాలను ఈ ఫీచర్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
గూగుల్ నిర్వహించిన 'ఈవెంట్ విమెన్ విల్' వర్చువల్ సమావేశంలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా పాల్గొన్నారు. భారతీయ మహిళ పారిశ్రామికవేత్తల ఎదుగుదలకు గూగుల్ తీసుకుంటున్న చర్యలు,ఆ కంపెనీ నిబద్దతను ఆమె కొనియాడారు. ఇది మహిళల సామాజిక,ఆర్థిక పురోగతికి బాటలు వేస్తుందన్నారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కూడా మహిళల పురోగతి కోసం కృషి చేస్తోందన్నారు. గడిచిన కొన్నేళ్లలో జన్ ధన యోజన,ముద్ర యోజనా వంటి పథకాల ద్వారా మహిళల అభివృద్దికి కృషి చేస్తున్నామన్నారు.