బంగారం దాచి పెట్టుకుని ప్రపంచానికి షాకిచ్చిన చైనా, ధరలు పెరగడానికి..!
బంగారం ధరలు నింగిని తాకి నేలకు దిగిరానంటున్నాయి. గత కొద్ది రోజుల నుంచి సామాన్యులు బంగారం ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న పసిడి ధరలు చూసి వామ్మో అనే పరిస్థితికి వచ్చారు. బంగారం కొనుగోలు చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి కనిపిస్తోంది. గత మూడు నెలల నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఏకంగా లక్షకు పైగా ధరలు పెరిగాయంటే బంగారం ధర ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇక రానున్న రోజుల్లో ఈ ధర దాదాపు లక్షా ముప్పై వేలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ మార్కెట్లో బంగారం నిల్వలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. 2025 రెండవ త్రైమాసికంలో ప్రపంచ దేశాలలోని నిల్వలలో బంగారం వాటా 23 శాతానికి చేరుకుంది. ఇది గత 30 సంవత్సరాలలో అత్యధికమని చెప్పుకోవచ్చు. గ్లోబల్ వైడ్ గా బంగారం నిల్వలు గత ఆరేళ్లలో దాదాపు రెట్టింపు అయ్యాయి. ఆసియా దేశాలతో సహా ప్రపంచదేశాల్లో ఉండే కేంద్ర బ్యాంకులన్నీ బంగారాన్ని తమ దగ్గర భారీగా నిల్వ పెట్టుకున్నాయి. చైనా, టర్కీ,ఇండియా, పోలెండ్ తో సహా ప్రపంచంలోని అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారు నిల్వలను వేగంగా పెంచుకుంటూ పోతున్నాయి.

ఇక భారత్ పొరుగుదేశమైన చైనా కేంద్ర బ్యాంకు గత ఏడు నెలలుగా బంగారాన్ని కొనుగోలు చేస్తూనే పోతోంది. ఇది మాత్రమే కాకుండా డ్రాగన్ కంట్రీ తమ దేశ పౌరులు బంగారు నిల్వలను పెంచుకోవాలని కూడా ప్రోత్సహిస్తోంది. 2000 సంవత్సరంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా వద్ద 395 టన్నుల బంగారం ఉండగా..అది ఇప్పుడు దాదాపు 2,280 టన్నులకు పెరిగిందని తెలుస్తోంది.
అయితే ఇది అధికారి లెక్కలు మాత్రమే..అనధికారికంగా చైనా వద్ద 5,000 టన్నుల బంగారం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. డ్రాగన్ కంట్రీ ఎవరికీ తెలియకుండా బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటుందనే తెలుస్తోంది. అయితే భారత్ వంటి దేశాలలో బంగారం కొనే సంప్రదాయం ఉన్నప్పటికీ చైనా కూడా ఇప్పుడు తమ పౌరులను కొనాలని ఆదేశాలు జారీ చేస్తోంది.అయితే చైనా నిరంతరం బంగారం కొనుగోలు చేస్తున్నప్పటికీ బంగారు నిల్వల విషయంలో ఇతర దేశాల కన్నావెనుకబడే ఉంది.
ఇక భారత్ విషయానికి వస్తే.. ఒక అంచనా ప్రకారం..భారత పౌరులు దగ్గర 25,000 టన్నుల కంటే ఎక్కువ బంగారం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికా బంగారు నిల్వలు 8,133.46 టన్నులు అని సమాచారం. ఇక తర్వాత యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన జర్మనీ వద్ద 3,351.53 టన్నులు, ఇటలీ వద్ద 2,451.84 టన్నులు. ఫ్రాన్స్ వద్ద 2,437 టన్నులు బంగారం నిల్వలు ఉన్నాయి. తర్వాత స్థానంలో చైనా 2,279.56 టన్నులతో ఉంది. ఆరవ స్థానంలో స్విట్జర్లాండ్ 1,039.94 టన్నులు, ఏడవ స్థానంలో ఇండియా 876.18 టన్నులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆర్‌బిఐ కూడా చాలా బంగారాన్ని కొనుగోలు చేసింది.
ఇక ఈ ఏడాది సంవత్సరం రెండవ త్రైమాసికంలో.. ప్రపంచ నిల్వలో US డాలర్ వాటా 10 శాతం పాయింట్లు తగ్గి 44 శాతానికి చేరుకుంది. ఇది 1993 తర్వాత అత్యల్పం అని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో యూరో వాటా కూడా 2 శాతం పాయింట్లు తగ్గి 16 శాతానికి చేరుకుంది. ఇది 16 సంవత్సరాలలో అత్యల్పమని చెప్పుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితులు, అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలతో ప్రపంచంలోని మెజార్టీ దేశాలు డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించి బంగారం వాటాను పెంచుకుంటూ పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధర గణనీయంగా పెరుగుతూ వస్తోంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.