FY22లో జీడీపీ వృద్ధి రేటు ఎలా ఉంటుందంటే, వడ్డీ రేట్ల సవరణ అప్పుడే
దక్షిణాసియా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత జీడీపీ వృద్ధిరేటు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8.3 శాతంగా ఉండవచ్చునని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా గత ఆర్థిక సంవత్సరం (FY21) మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్ 23.9 శాతం నమోదయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ, పూర్తి ఆర్థిక సంవత్సరానికి మైనస్ 7.3 శాతంగా నమోదయింది. అయితే కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన చర్యలు, వ్యాక్సినేషన్‌ను వేగవంతంగా పూర్తి చేస్తుండటంతో ఆర్థిక కార్యకలాపాలు ఎప్పటికప్పుడు పుంజుకుంటున్నాయి.
నరేంద్ర మోడీ ప్రభుత్వం వివిధ చర్యలతో ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడుతోంది. వివిధ రంగాలకు ప్రత్యేక పథకాలు, పీఎల్ఐ స్కీమ్స్ వంటివి ఆఫర్ చేస్తున్నారు. పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్‌లో సహకారం పెరుగుతుండటం, మ్యానుఫ్యాక్చరింగ్ పెంపుకు ఇన్సెంటివ్స్ వంటి అంశాలు ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమై, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 8.3 శాతంగా నమోదు కావడానికి ఆస్కారం ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది.

వృద్ధి రేటు ఎంత ఉండవచ్చునంటే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత రియల్ జీడీపీ 8.3 శాతంగా నమోదు కావొచ్చునని, గత జూన్ నెలలోను ఇదే అంచనాలు వెల్లడించినట్లు తెలిపింది. అయితే మార్చి 2021లో వేసిన అంచనాల కంటే మాత్రం 1.8 శాతం తక్కువ అని తెలిపింది. వచ్చే ఏడాది వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదు కావొచ్చునని పేర్కొంది. భారత కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 9.5 శాతంగా అంచనా వేసింది.
అయితే రికవరీ ఎప్పటికప్పుడు వేగవంతమవుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకొని, జీడీపీ వృద్ధి రేటు 10 శాతానికి చేరువ కావొచ్చునని భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతానికి కేంద్రం చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ చాలా కీలకమని చెబుతున్నారు. ఉచిత వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అలాగే, ఉచిత రేషన్ కూడా అందించింది. పెట్రోల్, డీజిల్ ఖర్చులు తగ్గకపోవడానికి కూడా ప్రధాన కారణం ఇదేనని అంటున్నారు.

7 శాతం వద్ద స్థిరీకరణ
డొమెస్టిక్ డిమాండ్ పెరగడానికి పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుబడుల్లో పెరుగుదల దోహదపడుతుందని, అలాగే మ్యానఫ్యాక్చరింగ్ ఉత్పత్తి పెంపు కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ (PLI) స్కీం ఉపయోగపడుతుందని వరల్డ్ బ్యాంకు తన నివేదికలో తెలిపింది. వచ్చే రెండేళ్లలో బేస్ ఎఫెక్ట్ కనిపించదని, అప్పుడు వృద్ధి స్థిరీకరించబడుతుందని అభిప్రాయపడింది.
అంటే గత ఏడాది కరోనా కారణంగా వృద్ధి రేటు మైనస్‌లోకి వెళ్లిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రికవరీ కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ వృద్ధి రేటు భారీగా ఉంటుంది. ఎందుకంటే గత ఏడాది భారీగా పడిపోయినందున ఈసారి పుంజుకుంటుంది. ఈ కారణంగా వచ్చే రెండేళ్లలో బేస్ ఎఫెక్ట్ తగ్గుతుంది. అప్పుడు వృద్ధి రేటు 7 శాతం వద్ద స్థిరీకరించబడుతుందని భావిస్తున్నారు. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడుల్లో నిర్మాణాత్మక సంస్కరణలతో పెట్టుబడిని తగ్గించడం, సరఫరాను మరింత పెంచే చర్యలను చేపడుతున్నట్లు పేర్కొంది.

వడ్డీ రేటు సవరణ అప్పుడే
వరల్డ్ బ్యాంకు చీఫ్ ఎకనిస్ట్ (సౌత్ ఏషియా) హాన్స్ టిమ్మర్ మాట్లాడుతూ జీడీపీ వృద్ధి అంచనాలు 8.3 శాతంగా ఉండవచ్చునని పేర్కొన్నారు. ఆర్బీఐ వడ్డీ రేట్లను ఎప్పుడు సవరిస్తుందనే అంశాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. వడ్డీ రేట్ల పెంపు అంసం అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్స్, ప్రపంచ దిగ్గజ ఆర్థిక వ్యవస్థల (దేశాలు) మానిటరీ పాలసీ అంశంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఆర్బీఐ కీలక సమయంలో సరైన విధంగా వ్యవహరిస్తోందని టిమ్మర్ అన్నారు. కేవలం వడ్డీ రేటు అంశమే కాకుండా, లిక్విడిటీ ఇంజెక్షన్, ఇతర చర్యలు తీసుకుంటోందన్నారు.