Elon Musk: గుదిబండలుగా టెస్లా కొత్త ఫ్యాక్టరీలు.. డబ్బును బూడిద చేస్తున్నాయంటున్న ఎలాన్ మస్క్..
Elon Musk: ప్రపంచ కుబేరుడుగా ఉన్న ఎలాన్ మస్క్ కు రోజు రోజుకూ కొత్త తలనొప్పులు వస్తూనే ఉన్నాయి. ఆయన కలల ప్రతిరూపమైన టెస్లా కంపెనీ ఇప్పుడు నష్టాలను తెచ్చిపెడుతోంది. బిలియనీర్ సంపదను ఆవిరి చేస్తోంది. కొత్త టెస్లా గిగా ఫ్యాక్టరీలు ఎలాన్ మస్క్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఆయన సంపదను అమాంతం కరిగించేస్తున్నాయి. చైనాలో బ్యాటరీల కొరత, సరఫరా అంతరాయాల కారణంగా జర్మనీ, యుఎస్‌లో టెస్లా కొత్త ఫ్యాక్టరీలు బిలియన్ల కొద్దీ డాలర్లను కోల్పోతున్నాయని ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు.
కన్నీరు పెట్టిస్తున్న టెస్లా ఫ్యాక్టరీలు..
బిలియనీర్ కు సంబంధించిన టెక్సాస్‌లోని బెర్లిన్, ఆస్టిన్‌లోని టెస్లా కార్ల తయారీ ప్లాంట్స్ "పెద్ద డబ్బు కొలిమిలు"గా మారాయని మస్క్ అన్నారు. ఇవి భారీ మెుత్తంలో సంపదను ఆవిరిచేస్తున్నాయని చెప్పకనే చెప్పారు. టెస్లా భారీ కర్మాగారాన్ని కలిగి ఉన్న షాంఘైలోను పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయి. ఈ సంవత్సరం చైనాలో కొవిడ్-19 లాక్‌డౌన్‌లు తయారీదారులకు పనిచేయడం కష్టతరంగా మార్చడంతో ఈ చిక్కులు వచ్చాయి. దీని కారణంగా ఎలాన్ మస్క్ ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమయ్యారు. ఈ వారంలో 10 శాతం వరకు ఉద్యోగుల కోత ఉంటుందని ముందుగానే హెచ్చరించారు.

బిలియన్ డాలర్లు ఆవిరి..
"బెర్లిన్, ఆస్టిన్ కర్మాగారాలు రెండూ ప్రస్తుతం భారీ డబ్బు కొలిమిలు. ఇది నిజంగా పెద్ద ఆందోళనకరమైన పరిస్థితి. ఇది డబ్బు మండుతున్న శబ్దాన్ని సూచిస్తోంది" అని ఎలక్ట్రిక్ వెహికల్ మేకర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ మస్క్ అన్నారు. ప్లాంట్లు ప్రస్తుతం బిలియన్ల డాలర్లను కోల్పోతున్నాయి. ఒక టన్ను ఖర్చుకు ఎటువంటి అవుట్‌పుట్ లేదని టెస్లా ఓనర్స్ ఆఫ్ సిలికాన్ వ్యాలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ చెప్పారు. గిగా ఫ్యాక్టరీలు ఉత్పత్తిని పెంచేందుకు కష్టపడుతున్నట్లు తెలిపారు. బ్యాటరీల తయారీలో వినియోగించే కొన్ని భాగాలు చైనా పోర్టుల్లో నిలిచిపోయాని వాటిని తరలించేందుకు ఎవరూ లేరని చెప్పారు.

ఇదంతా చాలా వేగంగా పరిష్కరించబడుతుందని, కానీ.. దీనికి చాలా శ్రద్ధ అవసరమని మస్క్ అన్నారు. షాంఘైని మూసివేయడం టెస్లాకు "చాలా చాలా కష్టం" కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. అనేక వారాలుగా గిగాఫ్యాక్టరీలో తయారీ పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు.సైట్ అప్‌గ్రేడ్ పనుల కోసం వచ్చే నెలలో రెండు వారాల పాటు మళ్లీ ప్లాంట్ మూసివేయబడుతున్నట్లు తెలుస్తోంది. టెస్లా ఆర్థిక వ్యవస్థ గురించి "సూపర్ బ్యాడ్ ఫీలింగ్" కలిగి ఉన్నట్లు మస్క్ గత వారం ఆందోళన వ్యక్తం చేశారు.