For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెంటిలేటర్ల తయారీకి.. సై అంటోన్న దేశీయ సంస్థలు!

|

కరోనా వైరస్(కోవిడ్-19) కరాళ నృత్యం చేస్తోన్న నేపథ్యంలో.. దేశంలో వెంటిలేటర్ల కొరత ఏర్పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. సాధారణంగా ఈ వెంటిలేటర్లను శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఉన్న వారికి అమర్చుతూ ఉంటారు. ఇవి సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని అత్యవసర చికిత్స గదులు(ఐసీయూ)లో ఉంటాయి.

ప్రస్తుతం ఈ వెంటిలేటర్లను, వాటి విడిభాగాలను మన దేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం మన దేశంలో వీటి సంఖ్య 50 వేల లోపే ఉండొచ్చని ఆ రంగంలోని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ బాధితుల కోసం 14 వేల వెంటిలేటర్లను ఉపయోగిస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో 10-12 లక్షల వెంటిలేటర్లు అవసరమవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో మన దేశంలో ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు 'లాక్‌డౌన్' ప్రకటించినప్పటికీ.. రోజురోజుకీ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోందే తప్ప తరగడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే జూన్, జులై నెలల నాటికి బాధితుల సంఖ్య భారీగా పెరిగితే వారికి సరిపడా వెంటిలేటర్లు అందుబాటులో ఉండకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

100 మందిలో 10 మందికి తప్పదు...

100 మందిలో 10 మందికి తప్పదు...

కరోనా వైరస్ కారణంగా ఇన్ఫెక్షన్‌‌కు గురైనప్పటికీ వెంటనే వెంటిలేటర్ అమర్చాల్సిన అవసరం ఉండదు. వైద్యులు వెంటిలేటర్ అమర్చకుండానే కరోనా బాధితులకు చికిత్స చేస్తుంటారు. అయితే ఈ వైరస్ బారిన పడిన ప్రతి 100 మందిలో 10 మందికి శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. అలాంటి వారినే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోకి తరలించి వెంటిలేటర్‌ను అమర్చుతారు.

80 శాతం మందికి సాధారణ చికిత్స...

80 శాతం మందికి సాధారణ చికిత్స...

కరోనా వైరస్ సోకి జలుబు, జ్వరంతో బాధపడే వారిలో 80 శాతం మంది సాధారణ చికిత్సతోనే కోలుకుంటారని వైద్య వర్గాల అంచనా. 10 శాతం మందికి సాధారణ ఆక్సిజన్ సిలిండర్ సాయంతో చికిత్స చేస్తారు. మిగిలిన 10 శాతం వారితోనే అసలు సమస్య. వీరికి వెంటిలేటర్ ద్వారా చికిత్స అవసరం అవుతుంది. ఇతరత్రా శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతూ.. కరోనా వైరస్ బారిన పడిన వారికి మాత్రమే ఈ వెంటిలేటర్ అవసరం ఎక్కువగా ఉంటుంది.

ఒక్కో వెంటిలేటర్ ధర ఎంతో తెలుసా?

ఒక్కో వెంటిలేటర్ ధర ఎంతో తెలుసా?

సహజంగా ఊపిరి పీల్చుకోవడం వీలవని రోగులకు కృత్రిమ శ్వాస కల్పించే ఈ వెంటిలేటర్ ఖరీదు కూడా చాలా ఎక్కువే. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోన్న, వాటి విడిభాగాలను దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేస్తోన్న ఒక్కో వెంటిలేటర్‌కు రూ.5-10 లక్షలు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి తగ్గకపోగా రోజురోజుకు మరింత ఉద్ధృతం అవుతున్న నేటి పరిస్థితుల్లో.. ఇంత ఖర్చు భరించి 10-12 లక్షల వెంటిలేటర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోగలమా? అన్నదే ఇప్పుడు మన ప్రభుత్వాల ముందున్న పెద్ద ప్రశ్న.

దేశీయంగా తయారు చేయడమే బెస్ట్...

దేశీయంగా తయారు చేయడమే బెస్ట్...

ఇన్నాళ్లూ వెంటిలేటర్లను అసెంబుల్ చేసే సంస్థలు వాటి తయారీలో ఉపయోగించే 8 రకాల సెన్సర్లు, రెసిస్టర్లు, కెపాసిటర్లు, డయోడ్‌లు వంటి విడి భాగాలను చైనా, అమెరికా, జపాన్, ఇతర యూరోప్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. ఉన్నట్లుండి కరోనా మహమ్మారి చైనాలో బయలుదేరి, మెల్లమెల్లగా ప్రపంచ దేశాలకూ విస్తరించడం, మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలూ ‘లాక్‌డౌన్' పాటిస్తోన్న నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులు కూడా నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల నుంచి విడిభాగాల కోసం ఎదురుచూసినా ప్రయోజనం పెద్దగా ఉండదు. అందుకే ఈ వెంటిలేటర్లను దేశీయంగా తయారు చేయడం మంచిది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ముందుకొచ్చిన దేశీయ సంస్థలు...

ముందుకొచ్చిన దేశీయ సంస్థలు...

దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో దేశీయంగా తక్కువ ఖర్చుతో వెంటిలేటర్లను డిజైన్ చేసి, ఉత్పత్తి చేసే బాధ్యతను భారత రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్‌డీవో), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి సంస్థలు స్వీకరించగా.. వాహన తయారీ సంస్థలైన మహీంద్రా అండ్ మహీంద్రా(ఎం అండ్ ఎం), మారుతి సుజుకీ కూడా వెంటిలేటర్ల తయారీకి ముందుకు వచ్చాయి. అంతేకాదు, డీఆర్‌డీవో ఒక అడుగు ముందుకేసి.. ఒకేసారి అనేక మందికి సేవలు అందించగలిగే వెంటిలేటర్‌ను డిజైన్ చేసింది. ఈ డిజైన్‌ను మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ సహా 9 కంపెనీలకు అప్పగించి.. తక్కువ వ్యవధిలో ఎక్కువ వెంటిలేటర్ల తయారీకి కృషి చేస్తోంది.

రూ.7,500కే దేశీయ వెంటిలేటర్...

రూ.7,500కే దేశీయ వెంటిలేటర్...

కరోనా వైరస్‌ చికిత్సకు సరిపడే ఆటోమేటెడ్ బ్యాగ్‌వాల్వ్ మాస్క్ వెంటిలేటర్‌ను రూ.7,500కే తయారు చేసే పనిలో తాము నిమగ్నమయ్యామంటూ ఇటీవల దాని ప్రోటోటైప్‌ను సైతం చూపిస్తూ ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. అలాగే మైసూర్ కేంద్రంగా పనిచేసే స్కన్‌రాయ్ టెక్నాలజీస్ వచ్చే రెండు నెలల్లో లక్ష వెంటిలేటర్లను తయారు చేయనున్నట్లు పేర్కొంది. మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వచ్చే ఒకటి రెండు నెలల్లో 30 వేల వెంటిలేటర్లను సరఫరా చేయాల్సిందిగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ను కోరింది.

మారుతి సుజుకీ ఏం చేస్తోందంటే...

మారుతి సుజుకీ ఏం చేస్తోందంటే...

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వెంటిలేటర్లు, మాస్క్‌లు, ఇతర వైద్య పరికరాల తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు మరో దేశీయ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకీ కూడా ప్రకటించింది. ఈ మేరకు మారుతి సుజుకి వెంటిలేటర్ల తయారీకి సంబంధించి లైసెన్స్ కలిగిన అగ్‌వా హెల్త్‌కేర్‌తో ఒక ఒప్పందం కూడా చేసుకుంది. దీని ప్రకారం.. మారుతి సుజుకి వెంటిలేటర్ల తయారీకి అవసరమయ్యే విడిభాగాలను తన భాగస్వామ్య కంపెనీలతో తయారు చేయిస్తుంది. దీనికి అవసరమయ్యే ఆర్థిక సాయం కూడా అందిస్తుంది. అయితే వీటి తయారీలో ఉపయోగించే సాంకేతికత, ఆపైన నిర్వహణ, విక్రయాల బాధ్యత మటుకు అగ్‌వా హెల్త్‌కేర్ చూసుకుంటుంది. నెలకు 10 వేల వెంటిలేటర్ల తయారీని లక్ష్యంగా పెట్టుకున్నామని మారుతి సుజుకీ వెల్లడించింది. అంతేకాకుండా తన మరో భాగస్వామ్య సంస్థ కృష్ణ మారుతిలో 3 అంచెల మాస్కులను కూడా తయారు చేయిస్తోంది. వచ్చే ఒకటి రెండు నెలల్లో 20 లక్షల మాస్కులను తయారు చేయించే పనిలో నిమగ్నమైంది.

English summary

drdo working with tata, mahindra on 'multi-patient ventilators'

The Defence Research and Development Organisation (DRDO) is trying to develop 'multi-patient ventilators', wherein several patients can be supported by a single ventilator to meet the huge demand if the Covid-19 outbreak goes out of control.The government is expected to procure 30,000 additional ventilators from Bharat Electronics, which is manufacturing a new model of the mechanical breathing device along with Mahindra & Mahindra, Tata Motors and Karnataka-based Skanray.
Story first published: Wednesday, April 1, 2020, 7:39 [IST]
Company Search