కరెన్సీ నోట్లతో కరోనా సోకుతుందా? డిజిటల్ పేమెంట్స్ ఉత్తమం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్ చెల్లింపులు చేయాలని కస్టమర్లకు ఎస్బీఐ కార్డ్స్ సూచించింది. అన్ని అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నగదు లావాదేవీల కంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మంచిదని సూచించింది.

డిజిటల్ ఉపయోగించండి..
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం LIC కూడా ప్రీమియం చెల్లింపుల కోసం ఆన్‌లైన్ సేవల్ని ఉపయోగించుకోవాలని సూచించింది. బజాజ్ అలియంజ్ లైఫ్, HDFC మ్యూచువల్ ఫండ్, యస్ బ్యాంకులు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను ప్రోత్సహించేవిధంగా నిర్ణయాలు తీసుకున్నాయి. PNB హౌజింగ్ ఫైనాన్స్ సిబ్బందిని దాదాపుగా తగ్గించి కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఇటీవల ఆర్బీఐ కూడా కరోనా నేపథ్యంలో డిజిటల్ బ్యాంకింగ్ ఉపయోగించాలని సూచించింది.

ఆ కరెన్సీ నోట్లు తాకితే ఇబ్బందులే
కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న విషయం తెలిసిందే. కరోనా బాధితులు తాకిన ఏ వస్తువును కూడా తాకకూడదు. ఇందులోకి కరెన్సీ నోట్లు కూడా వస్తాయి. మనం ఎవరికైనా నగదు ఇవ్వాలన్నా, ఎవరైనా ఇచ్చినవి సరిచూసుకోవాలన్నా డబ్బులు లెక్కిస్తాం. ఆన్ లైన్ బ్యాంకింగ్ వినియోగం ఇప్పుడిప్పుడే ఇటీవలే పెరుగుతున్నాయి. అయితే కరోనా ఉన్న వ్యక్తి తాకిన కరెన్సీ నోట్లు మనం తాకినా ఇబ్బందులే.

అలా ఆందోళనకరమే..
ఈ మేరకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ కరెన్సీ నోట్ల అంశంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై మిక్స్డ్ రెస్పాన్స్ కూడా ఉంది. చాలామంది చేతులతోనే నోట్లను లెక్కిస్తారు. వీటిని లెక్కించే క్రమంలో ఒకవేళ కరోనా సోకిన వ్యక్తి ఒకసారి నోట్ల తడి చేసి నోట్లను లెక్కిస్తే ఆ వైరస్ నోట్లోకి వెళ్తుందని చెబుతున్నారు. అయితే కరెన్సీ నోట్లపై ఎన్ని గంటలు ఉంటుందో తెలియరాలేదు. కానీ కొద్ది సమయంలోనే అది చేతుల్లోకి వస్తే మాత్రం ఆందోళనకరమే.

లెక్కిస్తే ఇలా చేస్తే చాలు..
పొరపాటున కరోనా సోకిన ఓ వ్యక్తి చేతి నుండి నోటు బయటకు వస్తే.. అది ఎక్కువ మంది చేతికి మారవచ్చు. వారందరి చేతికి కూడా వైరస్ సోకే ప్రమాదముంది. కాబట్టి కరెన్సీని సాధ్యమైనంత మేరకు తడి చేయకుండానే లెక్కించాలని సూచిస్తున్నారు. అలాగే ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు.

డిజిటల్ ట్రాన్సాక్షన్స్
సాధ్యమైనంత వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను ఉపయోగించాలని, చిన్న చిన్న ఖరీదుకు కూడా ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటివి ఉపయోగిస్తే సరి అని సూచిస్తున్నారు. కొన్నిసార్లు నోట్లు అంటుకుపోయినప్పుడు తడి చేస్తారు. అయితే దీని వల్ల వస్తుందని కాదు. కానీ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.