కోవిషీల్డ్ ధరను ప్రకటించిన సీరం ఇనిస్టిట్యూట్
ముంబై: కరోనా వ్యాక్సీన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కరోనా వ్యాక్సీన్ కోవిషీల్డ్ మరికొద్ది రోజుల్లో మన దేశంలో అందుబాటులోకి వస్తోంది. మొదటి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు అందిస్తారు. అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసకు వస్తారు. కోవిషీల్డ్ ధరపై సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. కోవిషీల్డ్ ధరను ప్రయివేటు మార్కెట్లో రూ.1000గా నిర్ణయించింది.
దేశంలో తొలి కోవిడ్ 19 వ్యాక్సిన్ అందించడం ఒక చారిత్రక క్షణమని సీరం సీఈవో అదర్ పూనావాలా ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను కేంద్రం ప్రత్యేక ధరకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మెగా టీకా డ్రైవ్‌లో అందించే కోవిషైల్డ్ వ్యాక్సిన్ ధరపై మాట్లాడుతూ తొలి 100 మిలియన్ మోతాదులకు మాత్రమే రూ.200 ప్రత్యేక ధరకు అందించామని, ప్రధానంగా సామాన్యులకు, బలహీనంగా, పేదలకు, ఆరోగ్య కార్యకర్తలతోపాటు, ఇతర అణగారినవర్గాలకు మద్దతు ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు.

ఇందులో భాగంగా లభాపేక్ష లేకుండా తక్కువ ధరను నిర్ణయించినట్లు తెలిపారు. 100 మిలియన్ యూనిట్ల సరఫరా తర్వాత కూడా ప్రభుత్వానికి సరసమైన ధరకు అందిస్తామన్నారు. అయితే రూ.200 కంటే కాస్త ఎక్కువ ఉంటుందన్నారు.