ఆ సంస్థను కొనుగోలు చేయనున్న బైజుస్.. ఎడ్యుటెక్ రంగంలో ప్రపంచంలోనే బిగ్ డీల్..!!
భారత్‌లో అతిపెద్ద ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్‌గా గుర్తింపు పొందిన బైజుస్ సంస్థ కొత్త ఏడాదిలో భారీ ఒప్పందం దిశగా అడుగులు వేస్తోంది. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్,మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం కోచింగ్ అందించే ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్‌ను బైజుస్ సంస్థ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 1 బిలియన్ డాలర్ ఒప్పందంపై బైజుస్ ఇప్పటికే సంతకం చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి జాతీయ మీడియాకు వెల్లడించారు.
రాబోయే రెండు,మూడు నెలల్లో ఓ కొలిక్కి రానున్న ఈ ఒప్పందం ఎడ్యుటెక్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఒప్పందంగా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ ఒప్పందంతో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ వ్యవస్థాపకులైన చౌదరి ఫ్యామిలీ పూర్తిగా పక్కకు తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఆకాష్ సంస్థలో బ్లాక్ స్టోన్ గ్రూప్‌కి చెందిన 37.5శాతం వాటాను బైజుస్‌కు వారు విక్రయించున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న బైజుస్ సంస్థ విలువ సుమారు 12బిలియన్ డాలర్లు. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అవసరం ఏర్పడటంతో బైజుస్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఫేస్‌బుక్,టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్&బాండ్ క్యాపిటల్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే బైజుస్‌లో పెట్టుబడులు పెట్టాయి. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంపై ఇప్పటికైతే బైజుస్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై స్పందించేందుకు ఆ సంస్థ ప్రతినిధి నిరాకరించారు.
ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ బ్లాక్ స్టోన్ గ్రూప్ సహకారంతో నడుస్తోంది. ఆకాష్ సంస్థకు దేశవ్యాప్తంగా 200 కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్,మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ సంస్థ కోచింగ్ అందిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 2,50,000 మంది విద్యార్థులు ఆకాష్ సంస్థల్లో కోచింగ్ తీసుకుంటున్నారు.
గతేడాది ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించడంతో అన్ని దేశాలు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పైనే ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బైజుస్ లాంటి ఆన్‌లైన్ విద్యా సంస్థలకు విద్యార్థుల నుంచి డిమాండ్ పెరిగింది.