Medicines Prices: బీపీ, షుగర్ రోగులకు చేదు వార్త.. పెరిగిన మందుల ధరలు.. ఎక్కడంటే..
Medicines Prices: మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా మారింది ప్రజల పరిస్థితి. ఇప్పటి వరకు గ్యాస్, నిత్యావసరాలు, పెట్రోల్ వంటి ధరల భారంతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై మందులు కూడా భారాన్ని మోపాయి. ప్రధానంగా..డాలర్‌తో రూపాయి మారకం విలువ నిరంతరం క్షీణించడం, దేశీయ స్టాక్‌ల క్షీణత కారణంగా దేశంలో ఔషధాల ధర అనూహ్యంగా పెరిగింది. లైవ్ హిందుస్థాన్ నివేదిక ప్రకారం.. ఉత్తరాఖండ్‌లో ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ధరలు 30 శాతం మేర పెరిగాయి. ఇక్కడ అనేక మందుల దుకాణాల్లో విక్రయించే కొత్త బ్యాచ్‌ల మందులు అధిక ధరలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
గ్లోబల్ మార్కెట్‌లో మెడికల్ ముడిసరుకు ధరలు పెరుగుతున్నాయని డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ హెడ్ ప్రమోద్ కలానీ తెలిపారు. ఇవి కూడా ధరల పెంపుకు దారితీశాయని చెప్పారు. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ పెరగడం వల్ల ముడిసరుకు ధరలు పెరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

గతంలో కిలో రూ.5,000గా ఉన్న పారాసిటమాల్ ముడిసరుకు ధర..రూ. 9,000లకు పెరిగింది. దీని ఫలితంగా మందుల తయారీ సంస్థలు అనేక మందుల ధరలను పెంచవలసి వచ్చిందని తెలుస్తోంది. గత నెలలో మందుల ధరలు 10-30 శాతం పెరిగాయని హోల్‌సేల్ కెమిస్ట్ అసోసియేషన్ హెడ్ మనీష్ నందా అన్నారు.
మరో పక్క పెరిగిన ముడి చమురు ధరలు కూడా ఔషధ కంపెనీలను తమ ఉత్పత్తుల ధరలను పెంచేలా ఒత్తిడి తెస్తోందని డ్రగ్ కంట్రోలర్ తాజ్బర్ జగ్గీ అంగీకరించారు. అయితే.. ధరల నియంత్రణకు లోబడి షెడ్యూల్ చేయబడిన మందులకు ధరల పెరుగుదల అనుమతించబడదని ఆయన చెప్పారు. షుగర్ చికిత్సలో ఉపయోగించే రైజోడెగ్ ఇంజక్షన్ గతంలో రూ.1024 ఉండగా.. ఇప్పుడు రూ.1126గా ఉంది. అదే విధంగా గ్లైకోమెట్ అనే చక్కెర ఔషధం గతంలో రూ.155 ఉండగా.. ఇప్పుడు రూ.170కి పెరిగింది. అదే విధంగా కాలేయ మందు ఉదిలివ్ గతంలో రూ.580 ఉండగా.. ఇప్పుడు రూ.694కి చేరింది.