LVB-డీసీబీ విలీనంపై ప్రమోటర్లకు కోర్టులో షాక్, 'ఆర్బీఐ వైఫల్యం తేలాలి'
లక్ష్మీ విలాస్ బ్యాంకు(LVB) నేటి నుండి (నవంబర్ 27, శుక్రవారం) డీబీఎస్ బ్యాంక్ ఇండియాగా కార్యకలాపాలు సాగించనుంది. LVB, డీబీఎస్ బ్యాంకు ఇండియాల విలీనంపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బాంబే హైకోర్టు గురువారం తిరస్కరించింది. ఈ విలీనాన్ని సవాల్ చేస్తూ లక్ష్మీ విలాస్ బ్యాంకు ప్రమోటర్లు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వేసిన పిటిషన్ పైన జస్టిస్ నితిన్ జమ్దార్, జస్టిస్ మిలింద్‌లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. వాదనల అనంతరం విలీనంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
లక్ష్మీ విలాస్ బ్యాంకు సంక్షోభం మరిన్ని వార్తలు

14లోపు అఫిడవిట్
అదే సమయంలో డిసెంబర్ 14న పిటిషన్లపై విచారణ జరుపుతామని, ఆ రోజు RBI, LVB, DBS బ్యాంకు ఇండయాలు తమ సమాధానాలతో కూడిన అఫిడవిట్స్‌ను సమర్పించాలని ధర్మాసనం సూచించింది. విలీనంపై స్టే విధించాలంటూ LVB ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, వాటాదారుగా ఉన్న ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ పటిషన్ వేశాయి. ఇందులో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం, డీబీఎస్ బ్యాంకులను ప్రతివాదులుగా చేర్చాయి. అయితే విలీనంపై స్టే విధించడానికి న్యాయస్థానం నిరాకరించింది. ఈ విలీనంతో రూ.188 కోట్లు నష్టపోతున్నట్లు ఇండియాబుల్స్ కోర్టుకు తెలిపింది. కానీ LVBని కాపాడే ఉద్దేశ్యంతో విలీనంపై నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తరఫు లాయర్ తెలిపారు.

విలీనంపై ఆందోళన
LVB సంక్షోభం నేపథ్యంలో ఆర్బీఐ వైఫల్యానికి సంబంధించి వివరాలు బయటకు రావాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. డీబీఎస్ బ్యాంకు ఇండియాలో విలీనం ద్వారా ఓ విదేశీ సంస్థను భారత బ్యాంకింగ్‌లోకి తీసుకు వచ్చారని అభిప్రాయపడింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం చెబుతున్న ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది విరుద్ధమని పేర్కొంది. కొంతమంది ప్రముఖులకు భారీ మొత్తాల్లో రుణాలు ఇవ్వడం వల్లే ఈ నష్టాలు సంభవించాయని అంటున్నారు. వారి రుణ చరిత్ర సక్రమంగా లేదని తెలిసి భారీ రుణాలను ఎందుకిచ్చారు, ఈ రుణాల మంజూరులో నిబంధనలను పాటించాల్సిందిగా ఆర్బీఐ ఎందుకు సూచించలేదనే అంశాలపై లోతైన దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉన్నదని ఏఐబీఈఏ డిమాండ్ చేసింది.

318 కోట్ల టైర్ 2 బాండ్స్ రైటాఫ్
ఇదిలా ఉండగా, రూ.318 కోట్ల విలువైన టైర్ 2 బాండ్స్‌ను రైటాఫ్ చేసినట్లు LVB స్టాక్ ఎక్సేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. 94 ఏళ్ల చరిత్ర కలిగిన LVB తన సుదీర్ఘ ప్రయాణంలో 90 ఏళ్ళు లాభాల బాటలో సాగింది. గత మూడేళ్లుగా నష్టాల్లో ఉంది.
విలీనానికి సంబంధించి తుది స్కీం ప్రకారం LVB పెయిడప్ షేర్ క్యాపిటల్ మొత్తం రైటాఫ్ చేస్తారు. దీంతో వాటాదారులకు ఏమీ దక్కది లేదని, పెట్టుబడిని కోల్పోతామని భావించిన ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు చట్టపరమైన చర్యలపై దృష్టి సారించారు. ప్రమోటర్ గ్రూప్‌నకు 6.8% వాటాలు ఉండగా, సెప్టెంబర్ చివరి నాటికి LVBలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌కు 4.99% ఉంది. ఇతర కంపెనీలకు కూడా వాటాలు ఉన్నాయి.