రూ.5,646 కోట్ల మాల్యా ఆస్తులను, షేర్లను విక్రయించుకోవచ్చు
బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా నుండి మొండి బకాయిలు వసూలు చేసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కన్సార్టియంకు PMLA కోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రూ.5,646 కోట్ల మొండి బకాయిలు వసూలు చేసుకోవడానికి న్యాయస్థానం అంగీకారం తెలిపింది. రుణదాతల కన్సార్టియం ఆయన స్థిరాస్తులు, షేర్లు విక్రయించుకునే అవకాశాన్ని కోర్టు కల్పించింది. మాల్యాకు రుణాలు ఇచ్చిన 11 బ్యాంకుల బృందం మనీలాండరింగ్ నిరోధక(PMLA) చట్టం కోర్టును ఆశ్రయించింది.
ఈడీ స్వాధీనం చేసుకున్న మాల్యా ఆస్తులను తాము విక్రయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. ఇందుకు ముంబై పీఎంఎల్ఏ కోర్టు అనుమతి ఇచ్చింది. రూ.5,646.54 కోట్ల విలువైన ఆస్తులు, షేర్లను బ్యాంకులు విక్రయించుకోవచ్చునని ఉత్తర్వులు ఇచ్చింది. మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు ఎస్బీఐ రూ.6900 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.800 కోట్లు, ఐడీబీఐ బ్యాంకు రూ.800 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.650 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 550 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.410 కోట్ల రుణాలు ఇచ్చాయి.
]

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాల కారణంగా PSBs ఎంత మొత్తం నష్టపోయాయనే విషయం ప్రస్తుతం చెప్పడం కష్టమని PMLA కోర్టు అభిప్రాయపడింది. రూ.6,200 కోట్ల వరకు నష్టపోయామనే బ్యాంకుల వాదన ఊహాజనితం కాదని పేర్కొంది. ఈ కేసు PMLA కోర్టు విచారణ పరిధిలోకి రాదనే మాల్యా లాయర్ల వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇది ప్రజాధనంతో కూడిన బ్యాంకుల కేసు అనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ కేసుకు, మాల్యా ఇచ్చిన వ్యక్తిగత పూచీకి సంబంధం లేదన్న మాల్యా లాయర్ల వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు.