air travel guidelines: కరోనా ఎఫెక్ట్, అలా చేస్తే విమానం దింపేస్తారు
గత ఏడాది కరోనా కారణంగా విమానరంగం పూర్తిగా నిలిచిపోవడంతో భారీ ప్రభావం పడింది. 2020లో ఈ రంగం ఎక్కువ కాలం స్తంభించిపోయి, విమానరంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. కరోనా కేసులు తగ్గడంతో విమానాలు మళ్లీ తిరుగుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండో దశ ప్రారంభం కావడం, దేశంలోను కేసులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఓ వైపు కరోనా వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చి వ్యాక్సినేషన్ వేగవంతమవుతోన్న సమయంలో, మరోవైపు పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలు తీసుకుంది.

ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే దింపేస్తాం
విమానంలో మాస్కులు ధరించకపోయినా లేదా కరోనా నిబంధనలను సరిగ్గా పాయింటకపోయినా ప్రయాణీకులను కిందకు దింపేస్తామని ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే పదేపదే హెచ్చరికలు చేసినప్పటికీ ప్రయాణీకులు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే, ఆ ప్రయాణీకుడిని విధేయత లేని ప్రయాణీకులుగా పరిగణిస్తామని తెలిపింది. ఈ మేరకు మార్చి 13న ప్రకటన విడుదల చేసింది DGCA.

మాస్కులు తీయవద్దు
విమాన ప్రయాణం చేసే కొంతమంది ప్రయాణికులు కరోనా ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండటం లేదని, విమానాశ్రయం నుంచి ప్రయాణికులు రాకపోకలు చేసే సమయంలో, ఎయిర్ పోర్టులో ఉన్నప్పుడు.. ఇలా అన్ని సమయాల్లో మాస్కులను కచ్చితంగా ధరించాలని ఆ ప్రకటనలో పేర్కొంది. విమానశ్రయ ప్రాంగణంలో కొంతమంది భౌతికదూరాన్ని పాటించడం లేదని పేర్కొంది. ప్రయాణీకులు ఎలాంటి పరిస్థితుల్లో మాస్కులు తీయవద్దని సూచన చేసింది.

పైలట్లకు నిబంధనలు
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పైలట్లు కనీసం 48 గంటల పాటు వేచి ఉండి, ఆ తర్వాత విమానాలు నడపాలని DGCA ఇదివరకు స్పష్టం చేసింది. అప్పటి వరకు వారంతా మెడికల్‌గా అన్‌ఫిట్ అని తెలిపింది. అలాగే, 48 గంటల తర్వాత కూడా ఎలాంటి ప్రతికూల లక్షణాలు లేకపోతే మాత్రమే నడపాలని తెలిపింది. అన్‌ఫిట్ లక్షణాలు రెండు వారాలకు మించి సాగితే వారికి ప్రత్యేక మెడికేషన్ పరీక్ష ఉంటుందని, అనంతరం వారికి ఫిట్‌నెస్ ఉందో లేదో వెల్లడిస్తామని తెలిపింది. సిబ్బందికి ఇదే వర్తిస్తుంది.