ఎయిర్ ఇండియా కొనుగోలుకు సర్‌ప్రైజ్ బిడ్... ఇంతకీ ఏంటా కంపెనీ...?
ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాను కేంద్రం ప్రైవేట్‌కు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. నష్టాల పేరుతో కేంద్రం ఎయిర్ ఇండియాను ప్రైవేట్ పరం చేసేందుకు సిద్దమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ ప్రక్రియ(expression of interest-EoI) పూర్తయింది. చాలా కంపెనీలు ఈవోఐ దాఖలు చేశాయి. అయితే పవన్ రుయా గ్రూప్ ఛైర్మన్ పవన్ రుయా కూడా ఈవోఐ దాఖలు చేయడం కేంద్రాన్ని ఆశ్చర్యపరిచింది. ఎయిర్ ఇండియాలో 100శాతం వాటాను తానొక్కడినే కొనుగోలు చేసేందుకు సిద్దమని అందులో పేర్కొన్నారు.
రుయా మొదట్లో ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఆ తర్వాత వ్యాపారవేత్తగా ఎదిగారు. మొదట్లో సుగర్ కంపెనీలు,ఆ తర్వాత టెక్స్‌టైల్,హెవీ ఇంజనీరింగ్,టైర్ల తయారీ రంగంలోకి ఆయన అడుగుపెట్టారు.
కోల్‌కతా వ్యాపార వర్గాల్లో 'టర్న్అరౌండ్ టైకూన్'గా ఆయన చాలా పాపులర్. అంటే,అనూహ్యంగా ఎదిగొచ్చిన వ్యాపారవేత్త అని అర్థం.డన్‌లాప్ ఇండియా, ఫాల్కన్ టైర్స్ మరియు జెసప్ వంటి ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న కంపెనీలను కొనుగోలు చేసిన పవన్ రుయా వాటిని లాభాల పట్టించారు. అయితే ప్రస్తుతం ఆ కంపెనీలు లిక్విడేషన్ సమస్యను ఎదుర్కొంటుండటం గమనార్హం.

ఇలాంటి తరుణంలో ఆయన ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం కేంద్రానికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే రుయా గ్రూపుతో భాగస్వామిగా మరో పెద్ద కంపెనీ ఏదైనా ముందుకొస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సంస్థకు బిడ్ దక్కడం కష్టమనే వాదన వినిపిస్తోంది. అదే సమయంలో గత అనుభవాల దృష్ట్యా... ఎయిర్ ఇండియాను కూడా తాను లాభాల బాట పట్టించగలనని రుయా భావిస్తున్నారేమోనని ఓ కార్పోరేట్ న్యాయవాది పేర్కొనడం గమనార్హం.నిబంధనల ప్రకారం... ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసే కంపెనీ నికర ఆస్తుల విలువ కనీసం రూ.3500 కోట్లు ఉండాలి.
మరోవైపు పవన్ రుయా మాత్రం ఇంతవరకూ ఈ బిడ్ వ్యవహారంపై నేరుగా స్పందించలేదు.