ఈ ఏడాది తొలి ఐపీఓగా ఇదే..పూర్తి వివరాలివే
ముంబై: ఈ ఏడాది ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ల సందడి అంచనాలకు భిన్నంగా సాగుతోంది. ఈ ఏడాది తొలి రెండు వారాలు కొత్త ఐపీఓలు ఏవీ ఎంట్రీ ఇవ్వలేదు. ఫలితంగా స్టాక్ మార్కెట్లు కొంత బోసిపోయినట్టే కనిపించింది. సెకెండరీ షేర్ల కొనుగోళ్ల హవా నడిచింది. తొలి వారంలోనే రావాల్సిన గో ఎయిర్, అదాని విల్మార్ వంటి ప్రిస్టేజియస్ ఐపీఓలు వెనక్కి వెళ్లిపోయాయి. దీనికి కారణం- కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోండటమే. నుస్లీ వాడియాకు చెందిన గో ఎయిర్ ఐపీఓ.. వచ్చేనెలకు షెడ్యూల్ చేసినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

క్యాష్ మేనేజ్‌మెంట్ కంపెనీ..
ఈ పరిస్థితుల మధ్య ఎట్టకేలకు ఓ ఐపీఓ ఇన్వెస్టర్ల ముందుకు రానుంది. తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అదే- ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్. పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్, క్యాష్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఇది. తన పబ్లిక్ ఇష్యూ వివరాలను ప్రకటించింది. ఈ ఐపీఓ ఈ నెల 19వ తేదీన ఓపెన్ కానుంది. 21వ తేదీన క్లోజ్ అవుతుంది. ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్లు ఈ మూడు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రైస్‌బ్యాండ్..
ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ.166-రూ.175గా నిర్ధారించింది కంపెనీ యాజమాన్యం. కనీసం 85 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 85 షేర్లను ఒక లాట్‌గా ప్రకటించింది. బేసిస్ అలాట్‌మెంట్ ఈ నెల 27వ తేదీన ఉంటుంది. షేర్స్ అలాట్‌మెంట్ కాని వారికి ఆ మరుసటి రోజున రీఫండ్ చేస్తుందీ కంపెనీ. ఫిబ్రవరి 1వ తేదీన స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అవుతుంది. మొత్తంగా 680 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సమీకరించుకోవాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ యాజమాన్యం పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది.

రూ.800 కోట్ల నుంచి కుదింపు..
ఇదివరకు ఈ మొత్తాన్ని 800 కోట్ల రూపాయలుగా నిర్ధారించింది. ఇదే విషయాన్ని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ వద్ద దాఖలు చేసిన రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌లోనూ స్పష్టం చేసింది. ఆ తరువాత ఈ మొత్తాన్ని 680 కోట్ల రూపాయలకు కుదించుకున్నట్లు ప్రమోటర్ రవి బీ గోయెల్ తెలిపారు. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్‌పై గ్రే మార్కెట్ అంచనాలు పెద్దగా ఉండట్లేదు. దీని జీఎంపీ 23 రూపాయలు. అంటే 23 రూపాయలు అధికంగా బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోకి లిస్టింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు గ్రే మార్కెట్ అంచనా వేసింది.

రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 35 శాతం..
మొత్తం పబ్లిక్ ఇష్యూల్లో సగం వాటాను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేసినట్లు రవి బీ గోయెల్ తెలిపారు. 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లు, మిగిలిన 15 శాతాన్ని నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేశామని పేర్కొన్నారు. కాగా- ఐసీఐసీఐ సెక్యూరిటీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జేఎం ఫైనాన్షియల్ కంపెనీలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఈ పబ్లిక్ ఇష్యూ ప్రాసెస్ మొత్తాన్నీ ఆయా కంపెనీలు పర్యవేక్షిస్తాయి.