అమెజాన్ కొత్త లోగో పై నెటిజెన్ల ఆగ్రహం..వెంటనే మార్పు: ఏమైంది..?
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన లోగోను మార్చింది. లోగో మార్పు లేదా ఆ డిజైన్ పై నెటిజెన్ల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో తిరిగి మరో కొత్త లోగోను తీసుకొచ్చింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత అమెజాన్ సంస్థ కొత్త లోగోను ఆవిష్కరించింది. జనవరిలో లోగోను మార్చగా అందులో నీలిరంగు టేపు డిజైన్ అమెజాన్ స్మైల్‌పై ఉంచారు. అయితే చాలామంది నెటిజెన్లు ఈ డిజైన్ పై భగ్గుమన్నారు.
అమెజాన్ సంస్థ తీసుకొచ్చిన కొత్త లోగో డిజైన్ అచ్చం జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు ఉండే టూత్ బ్రష్ మీసంను పోలి ఉందంటూ నెటిజెన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు. ఇలా అయితే అమెజాన్ నుంచి వస్తువులు కొనుగోలు చేసేది లేదంటూ మరికొందరు హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన అమెజాన్ సంస్థ వెంటనే లోగో డిజైన్‌ను మార్చక తప్పలేదు.

తమ కస్టమర్లు తమకు దేవుళ్లని వారు ఏది కోరుకుంటే వారి ప్రకారమే నడుచుకునేందుకు అమెజాన్ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే కొత్త డిజైన్‌తో కస్టమర్లను మరింత ఆకట్టుకుని వారిలో మరింత సంతోషం చూడాలనే భావనతోనే ముందుకొచ్చినట్లు చెప్పారు. కస్టమర్లు తమ ఫోన్లలో షాపింగ్ చేసినప్పటి నుంచి వారు ఆర్డర్ చేసిన వస్తువు తమ ఇంటి తలపు వద్దకు చేరే వరకు వారిలో ఎలాంటి సంతోషం లేదా ఆనందం వ్యక్తమవుతుందో అలాంటి సంతోషం చూడటం కోసమే లోగో డిజైన్‌లో మార్పులు చేసినట్లు చెప్పారు.
లోగో గమనించినట్లయితే మడత పెట్టి టేప్ వేసిన బాక్స్ పై బ్లూ కలర్ స్ట్రిప్ కనిపిస్తుంది.
i keep thinking the new amazon app logo is aang from avatar 😭 pic.twitter.com/YkIdcvNruh
— 𝑁𝑜𝑘𝑒𝑠🃏 (@ixNOKES) March 2, 2021
ఇక ట్విటర్‌పై చాలామంది నెటిజెన్లు తమకు తోచినట్లుగా అమెజాన్ కొత్త లోగోపై ట్వీట్ చేశారు. కొత్త లోగో చూశాక తాను అమెజాన్ పై ఇక ఏమీ కొనుగోలు చేయనంటూ ఓ యువతి ట్వీట్ చేసింది. మరో నెటిజెన్ అయితే కొత్త లోగో అవతార్‌లోని ఆంగ్‌ను పోలిఉందంటూ ట్వీట్ చేశారు.అమెజాన్ సంస్థ ఐఓఎస్ పై ఫిబ్రవరి 22వ తేదీన లోగోను మార్చగా ఆండ్రాయిడ్ ఫోన్లలో మార్చి 1వ తేదీన లోగో డిజైన్‌ను మార్చింది. కొత్త
ఇదిలా ఉంటే నెటిజెన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదుర్కొన్న సంస్థల్లో అమెజాన్ తొలి సంస్థ కాదు. అంతకుముందు కూడా మింత్ర అనే వస్త్రాల సంస్థ కూడా ఇదే తరహా అభ్యంతరాలను ఎదుర్కొంది. మహిళలను కించపరిచేలా లోగో డిజైన్ చేసి ఉండటంతో నెటిజెన్లు మింత్ర సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మింత్ర లోగోను మార్చక తప్పలేదు. అదే సమయంలో తాము చేసింది పొరపాటని క్షమించాల్సిందిగా ఓ ప్రకటన ద్వారా మింత్ర సంస్థ కోరింది.