కరోనా దెబ్బ, ఒక్క ప్రాంతంలోనే 8 కోట్ల ఉద్యోగాల కోత: వారి ఆదాయం 10% డౌన్
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. కేవలం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ వైరస్ కారణంగా 81 మిలియన్ల మంది (8.1 కోట్లు) ఉద్యోగాలు పోయినట్లు అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ తెలిపింది. కొవిడ్ 19 వల్ల ఈ ప్రాంతంలోని ఉద్యోగ మార్కెట్ పైన తీవ్రమైన ప్రభావం పడిందని, చాలా దేశాలకు తక్కువ సామాజిక భద్రత, వ్యవస్థాపరమైన శక్తిసామర్థ్యాలు తక్కువగా ఉన్నాయని, దీంతో వ్యాపార సంస్థలకు చేయూతనిచ్చేందుకు, వర్కర్లు నిలదొక్కుకునేందుకు సాయం సాధ్యం కాలేదని ది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ఆసియా పసిఫికి విభాగం రీజినల్ డైరెక్టర్ తెలిపారు.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది, 15 రోజుల్లో రెండోసారి

అక్కడే 5 కోట్ల ఉద్యోగాలు
గత ఏడాదితో పోలిస్తే ఆసియా పసిఫిక్ విభాగంలో ఉద్యోగాలు 4.2 శాతం తగ్గినట్లు తెలిపింది. మహిళల్లో ఈ తరుగుదల 4.6 శాతంగా ఉండగా, పురుషుల్లో 4 శాతంగా ఉంది. యువతలో ఎక్కువగా పని గంటలు, ఉద్యోగాలు ప్రభావితమైనట్లు వెల్లడించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో యువత అత్యధికంగా ఉన్నట్లు పేర్కొంది. కార్మికుల ఆదాయం మొదటి త్రైమాసికంలో 9.9 శాతం తగ్గగా, తర్వాత క్వార్టర్‌లో 3.4 శాతం తగ్గింది. దక్షిణాసియాలో స్థానిక ఉద్యోగాల్లో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, కరోనా ముందు పరిస్థితితో పోలిస్తే దాదాపు 50 మిలియన్ల(5కోట్లు) ఉద్యోగాలు ప్రభావితమైనట్లు తెలిపింది.

యువత ఉపాధి నష్ట వాటా
కరోనా వల్ల మొదటి మూడు త్రైమాసికాల్లో వర్కింగ్ హవర్స్ నష్టాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. రీజినల్ నిరుద్యోగిత రేటు 2019లో 4.4 శాతం కాగా, 2020లో 5.2 శాతం నుండి 5.7 శాతానికి పెరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. నివేదిక ప్రకారం ఏసియా-పసిఫిక్ ప్రాంతంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా వర్కింగ్ హవర్స్‌ను కోల్పోయారు. మొత్తం ఉపాధి నష్టంలో యువత వాటా 3 నుండి 18 రెట్లు ఎక్కువగా ఉంది.

ఆదాయం 10 శాతం డౌన్
నిరుద్యోగం పెరగడంతో, కొత్త ఉద్యోగాల కోసం పోటీ పడటం కూడా ఇబ్బందికరమేనని ఈ నివేదిక తెలిపింది. ఒకవేళ ఏదైనా ఉద్యోగం దొరికినా అది వారి ఆశలు, ఆశయాలకు తగినట్లుగా ఉండకపోవచ్చునని చెబుతున్నారు. తక్కువ వేతన పనితో ఆదాయాలు తగ్గుతున్నాయి. మొత్తంగా మొదటి మూడు త్రైమాసికాల్లో ఈ ప్రాంతాల్లో కార్మికుల ఆదాయం 10 శాతం మేర పడిపోయి ఉంటుందని అంచనా.