బెంగుళూరులో రూ. కోటి జీతం లేకుంటే బతకడం కష్టం..వెంటనే ఇంటికెళ్లిపోండి, టెకీల మధ్య చర్చల రచ్చ..
దేశంలో కాని, ప్రపంచంలో కాని టెకీల జీతాలు చాలా హై స్థాయిలో ఉంటాయి. టాప్ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇస్తుంటాయి. అయితే ఆ జీతాలు కూడా సరిపోవడం లేదని చాలా మంది మొత్తుకుంటూ ఉంటారు. విలాసాలకు అలవాటు పడిన చాలా మంది తమకు లక్షలు జీతం వచ్చినా సరిపోవడం లేదని భోరుమంటుంటారు. ఇక బెంగుళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో లక్షలు జీతాలు వచ్చినా అవి నెల ఖర్చులకు సరిపోవడం లేదని సోషల్ మీడియా వేదికగా చాలామంది గగ్గోలు పెడుతున్నారు.
తాజాగా దీనిపై సోషల్ మీడియాలో పెద్ద డిబేటే జరిగింది. ఎక్స్ లో సౌరభ్ దత్తా అనే యూజర్ ఓ పోస్ట్ చేశాడు. బెంగళూరులోని ఐటీ రంగంలో రూ. 50 లక్షల వార్షిక వేతనం (LPA) ఇప్పుడు రూ. 25 లక్షల స్థాయిగా మారిపోయిందా? అనే ప్రశ్నతో అతను ఎక్స్ వేదికగా ప్రశ్నను సంధించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెక్ ఉద్యోగుల్లో ఈ పోస్టు పెద్ద చర్చకు దారితీసింది. చాలామంది ఈ చర్చలో భాగంగా ప్రాంతాల మధ్య వ్యత్యాసాలను కూడా బయటకు తీసుకువచ్చారు.

దేశానికి సిలికాన్ వ్యాలి అయిన బెంగళూరులోని ఐటీ రంగంలో చాలా మంది 50 లక్షల రూపాయల ప్యాకేజీ సంపాదిస్తున్నారని వింటున్నా.అయితే వాళ్లు CTC పెంచి చెప్పుతున్నారా లేక నిజంగానే 50LPA కొత్త 25LPA అయిందా? దీన్ని టెకీలు ఎవరు ఉన్నారో ధృవీకరించగలరా?" అని సౌరభ్ దత్తా అనే నెటిజన్ X లో పోస్ట్ చేయడంతో ఈ చర్చ మొదలైంది. ఈ పోస్ట్‌కు టెక్ రంగంలో పనిచేస్తున్న అనేక మంది సాప్ వేర్లు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
ఈ చర్చలో ప్రధానంగా చాలామంది బెంగళూరు నగరం అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నది..అలాంటి టెక్ నగరంలో రూ. 50 లక్షల ప్యాకేజీ కూడా పెద్దగా అర్థం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ పోస్టుపై ఓ నెటిజన్ స్పందిస్తూ. రూ. 50 లక్షలు అనేది ఇప్పుడు రూ 10 లక్షలుగా మారిపోయింది. చాలా మంది అయితే కోటి రూపాయలకంటే ఎక్కువే సంపాదిస్తున్నారని తెలిపారు. ఇంకొంత మంది నెటిజన్లు అయితే..బెంగళూరు నగరంలో కోటి రూపాయలకు పైగా సంపాదించట్లేదంటే టైమ్ వేస్ట్. ఇంటికి వచ్చేయడం మేలు అంటూ ఘాటుగా స్పందించారు.మరొక నెటిజన్ మీరు రూ. 50 లక్షల జీతాన్ని ఎలాంటి ప్రాతిపదికతో పోలుస్తున్నారని ప్రశ్నించారు.2005, 2015 లేదా 2020 వేతనాలతో ఈ జీతాన్ని పోలుస్తున్నారా అని అడిగారు.
ఆ పోస్టులో కామెంట్ చేసిన చాలామంది అభిప్రాయాలు టెక్ ప్రపంచంలోని వాస్తవాలు, అంచనాలు, అంచనాలకు సంబంధించిన విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొందరు యూజర్లు జీతాల పెరుగుదలను అంగీకరించినప్పటికీ.. ఈ స్థాయి ప్యాకేజీలు ఎక్కువగా గ్లోబల్ కంపెనీల్లో ఉన్న సీనియర్ లేదా టాప్-టియర్ టెక్ ప్రొఫెషనల్స్‌కే వర్తిస్తాయంటూ స్పష్టంగా తెలిపారు. ఇక కొందరైతే..ఇది బెంగళూరుకే చెందిన విషయం. హైదరాబాద్‌లో ఇప్పటికీ రూ. 25 లక్షలు అంటే రూ. 25 లక్షలే చాలా మంది అంతకన్నా తక్కువే సంపాదిస్తున్నారంటూ స్పందించారు. ఇది బెంగళూరులో జీతాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపించినా, వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయని సూచించడమేనని చెప్పకనే చెబుతోంది.
మరికొందరు ఇంకాస్త ముందుకెళ్లి Microsoft కంపెనీ రూ. 50 లక్షలు జీతం ఆఫర్ చేస్తుంది కాని బేస్ సెలరీ కేవలం రూ.16 లక్షలు మాత్రమే. మిగతాది RSUs (Restricted Stock Units) కింద కట్ అవుతాయి.ఇవి 3-4 ఏళ్లలో వెస్ట్ అవుతాయని చెప్పుకొచ్చారు. వారు ఇలా జీతం ఎలా వస్తుందో వివరిస్తూ.. ఇన్-హ్యాండ్ నెల జీతం కొన్ని సందర్భాల్లో రూ. 1.2 లక్షల వరకూ తక్కువగా ఉండొచ్చని తెలిపారు.
కాగా బెంగళూరు ప్రపంచంలో అత్యుత్తమ టెక్నాలజీ హబ్‌లలో ఒకటిగా తన స్థానాన్ని మన్నించుకుంది. CBRE విడుదల చేసిన Global Tech Talent Guidebook 2025 ప్రకారం.. బెంగళూరులో టెక్ వర్క్‌ఫోర్స్ 10 లక్షల మార్క్‌ను దాటి.. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే అతిపెద్ద టెక్ టాలెంట్ మార్కెట్‌గా మారిందని పేర్కొన్నారు. ఈ డేటా చూస్తే.. జీతాలపై చర్చ కేవలం సెంటిమెంట్ మాత్రమే కాకుండా, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలోని మారుతున్న ప్రమాణాల ప్రతిబింబంగా కూడా చెప్పవచ్చు.