ఇక పేటీఎం వార్తలు, వీడియోలు... ఎప్పటి నుంచో తెలుసా...
డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం తన సేవలను మరింతగా విస్తరించుకుంటోంది. ఇప్పటికే కస్టమర్లు, వ్యాపారులకు సమగ్రమైన చెల్లింపు సర్వీసులను పేటీఎం అందిస్తున్న విషయం తెలిసిందే. 70 లక్షలకు పైగా వ్యాపారులకు మొబైల్ పేమెంట్ సొల్యూషన్లను ఆఫర్ చేస్తోంది. కార్డులు, బ్యాంకు ఖాతాలు, డిజిటల్ క్రెడిట్ ద్వారా కస్టమర్లు మొబైల్ చెల్లింపులు చేసే సదుపాయం కల్పిస్తోంది. క్యూఆర్ ఆధారిత మొబైల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తోంది. పే టీమ్ పే మెంట్స్ బ్యాంక్ ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులను విస్తరిస్తోంది. ఈ సంస్థలో సాఫ్ట్ బ్యాంక్ , సైఫ్ పార్టనర్స్, అలీబాబా గ్రూప్,యాంట్ ఫైనాన్సియల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడీ సంస్థ మరింతగా తన సర్వీసులను విస్తరించుకుకోవడం పై దృష్టి సారించింది.

సెప్టెంబర్ నాటికీ..
* పేటీఎం ఇప్పటిదాకా అందిస్తున్న సర్వీసులకు బిన్నంగా కంటెంట్, వార్తలు, చిన్న వీడియోలు, లైవ్ టీవీ వంటి సర్వీసులను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
* ఈ సేవలు వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
* ఈ కొత్త సర్వీసుల ద్వారా నెలవారీ యాక్టీవ్ కస్టమర్ల సంఖ్యను 25 కోట్లకు పెంచుకోవాలనుకుంటోంది. ఈ స్థాయిలో కస్టమర్లు రావాలంటే పేటీఎం వినూత్నంగా ఈ సర్వీసులను అందుబాటులోకితీసుకురావాల్సి ఉంటుంది.
* ఇప్పుడు అధిక శాతం మంది మొబైల్ ఫోన్ ద్వారానే వార్తలు చదువుతున్నారు. చదువుకున్నవారు, చదువుకొని వారు వీడియోలకు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విభాగంపై పే టీఎం దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
* ఇప్పటికే పేటీఎం ఇన్ బాక్స్ కు నెలవారీగా 2. 7 కోట్ల మంది యాక్టీవ్ యూజర్లున్నారు.

స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలతో డీల్స్
* కొత్త కంటెంట్ తో దీన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్ళనున్నారు. దీని ద్వారా కొత్తగా 6-7 కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకోవాలన్న లక్ష్యంతో ఉంది.
* వినియోగదారులను పెంచుకోవడానికి స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలతో డీల్స్ కుదుర్చుకొంటోంది.
* వీటి ద్వారా మొబైల్ ఫోన్ లో ఇన్ బిల్ట్ గా పే టీ ఎమ్ యాప్ ఉంటుందన్న మాట. ఇప్పటికే చాలా కంపెనీలు మొబైల్ ఫోన్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా తమ యాప్ లను ఇన్ బిల్ట్ గా అందిస్తున్నాయి.
* సాధారణంగా ఓక యాప్ ను వినియోగించుకోవాలనుకుంటే దాన్ని యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ డౌన్ లోడ్ అయి వస్తే దాన్ని ఎక్కువ మంది వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల వినియోగ దారుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది.

క్యూఆర్ కోడ్ కోసం భారీగా పెట్టుబడులు
* వివిధ రకాల చెల్లింపులు చేయడానికి, చెల్లింపులు స్వీకరించడానికి ఉప యోగపడే క్యూ ఆర్ కోడ్ ను మరింతగా విస్తరిస్తోంది పేటీఎం.
* ఇందుకోసం రూ. 250 కోట్లు ఖర్చు చేయనుంది.
* ఈ పెట్టుబడితో వచ్చే మార్చి నాటికీ దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది మార్చంట్లను చేరుకోవాలనుకుంటోంది.
* పే టీఎం క్యూ ఆర్ కోడ్ ద్వారా ఇప్పటికే 1.2 కోట్ల మంది వ్యాపారాలు చెల్లింపులను స్వీకరిస్తున్నారు.