సెర్చింజన్, గూగుల్ న్యూస్ ద్వారా రూ.33వేల కోట్ల ఆదాయం
వాషింగ్టన్: ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌కు 2018లో సెర్చ్, గూగుల్ వార్తల పైన 4.7 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని ఓ సర్వేలో వెల్లడైంది. అంటే మన రూపాయల్లో దాదాపు రూ.33వేల కోట్లు. గూగుల్ వ్యాపారంలో న్యూస్ కీలకమని న్యూస్ మీడియా అలయన్స్ (NMA) సోమవారం విడుదల చేసిన సర్వేలో వెల్లడైంది. NMA అమెరికాలోని రెండువేల వార్తా పత్రికలకు ప్రాతినిథ్యం వహిస్తోంది.
పలు మీడియా సంస్థలకు ఆన్‌లైన్ ప్రకటనల ఆదాయం తగ్గిపోతూ మూతబడుతున్నాయి. కానీ గూగుల్ ఆదాయం మాత్రం బాగుందని ఈ సర్వేలో వెల్లడిచింది. గూగుల్ వ్యాపారంలో వార్తలు ముఖ్యభూమిక పోషిస్తున్నాయని, గూగుల్‌కు 470 కోట్ల డాలర్ల ఆదాయం రావడంలో, వార్తలను రూపొందించిన విలేకరులకూ పాత్ర ఉందని పేర్కొంది.

గత ఏడాది డిజిటల్ ప్రకటనల ద్వారా అమెరికా వార్తా పరిశ్రమ మొత్తం కలిపి 5.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.35,700 కోట్ల) ఆదాయం ఆర్జించిందని, కానీ గూగుల్ వాటితో పోటీపడినట్లుగా 33వేల కోట్లకు చేరి, వాటికి సమీపంలో ఉంది.
యూజర్లు వార్తలను సెర్చ్ చేసే క్రమంలో వారు చేసే ప్రతి క్లిక్ పైన, గూగుల్‌కు లభించే వ్యక్తిగత డేటా విలువను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ సమాచారం నుంచి కూడా గూగుల్‌కు ఆదాయం వచ్చే అవకాశముంది. గూగుల్ ట్రెండింగ్ విచారణలో నలభై శాతం క్లిక్‌లు వార్తలకు సంబంధించే ఉంటున్నాయని తేలింది. ఈ వార్తల కోసం గూగుల్ చెల్లింపులు ఉండవు.
గూగుల్‌తో పాటు ఫేస్‌బుక్ కూడా వార్తాపత్రికల ప్రధాన వనరు. ఈ రెండింటి నుంచి 80 శాతానికి పైగా క్లిక్‌లు వేరే సైట్లకు వెళ్తాయి. మధ్యవర్తిగా ఉంటాయి. మధ్యవర్తిగా ఉన్నందుకు ప్రకటనల ఆదాయంలో వాటా మాత్రం ఉంటుంది. దీంతో వార్తా సంస్తలకు ఆదాయం తగ్గుతోంది.