గ్రంథి మల్లికార్జున రావు వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు
జీఎంఆర్ అంటే గ్రంథి మల్లికార్జునరావు... ఆ పేరు చాలా మంది తెలుగువారికి సుపరిచితమే. ఆ మాటకొస్తే వ్యాపార వర్గాల్లో దేశమంతా ఆయన పేరు తెలిసే ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో ఒక పల్లె నుంచి అంతర్జాతీయ స్థాయి కంపెనీని నిర్మించేంత వరకూ ఆయన ప్రతి అడుగు ఎంతో మందికి స్పూర్తిమంతం. జ్యూట్ మిల్లులో కెరీర్ ప్రారంభించి జీఎంఆర్ అనే పెద్ద కంపెనీని ఆయన ఎలా స్థాపించారు, ఆ సంస్థ చేపట్టిన వివిధ ప్రాజెక్టుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1. విద్యాభ్యాసం
తెలుగు రాష్ట్రాల్లో చదువుకు ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అందుకు మల్లికార్జున రావు సైతం మినహాయింపు కాదు. మొదట ఆయన పదో తరగతి ఫెయిల్ అయ్యారు. దాంతో తండ్రి నీకు చదువులొద్దని, కుటుంబ వ్యాపారంలో తోడుగా ఉండమని ఆదేశించారు. అయతే తల్లికి చెప్పి తనకు చదువుకోవాలని ఉన్న కోరికను అందరికీ తెలిసేలా చేశారు. రెండేళ్ల తర్వాత మళ్లీ పాఠశాలలో చేరేలా చేశారు. ఆ తర్వాత చదువుల మీద ఉన్న ఆసక్తి కొద్దీ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.

2. వ్యాపారంలోకి ప్రవేశించారు...
తండ్రి మరణం తర్వాత శ్రీకాకుళంలోని బంగారం, జ్యూట్ వ్యాపారాన్ని వదులుకుని మల్లికార్జున రావు రాజమండ్రిలోని ఏపీ పేపర్ మిల్లు ఉద్యోగంలో చేరారు. అక్కడ వ్యాపారంలో మెలకువలు తెలుసుకోవడం ప్రారంభించారు. అనంతరం వంశధార ప్రాజెక్టులో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరారు. రాజమండ్రిలో ఉండగానే, జ్యూట్ వ్యాపారంలో మార్వాడీల నైపుణ్యతను, వివిధ వర్గాల వారు చేసే గిమ్మిక్కులను తొందరగానే ఔపోసన పట్టారు. ఒక ప్రభుత్వం ఉద్యోగం(ఏఈ), మరో ప్రైవేటు ఉద్యోగం చేసిన తర్వాత కాస్త అనుభవం గడించారు. తర్వాత పరిశ్రమ, వ్యాపారం గురించి తనదైన పరిశోధన చేసి మొట్టమొదటి సారి సొంతంగా 'కాటన్ ఇయర్ బడ్స్ ఫ్యాక్టరీ'ని నెలకొల్పారు.

3. వ్యాపార విస్తరణ, విక్రయాలు
చెన్నైలో జూట్ ఫ్యాక్టరీని కొని విజయవంతంగా నడిపిన జీఎంఆర్ తర్వాత వివిధ వ్యాపారాల్లోకి ప్రవేశించారు. కమొడిటీలు, ఆయిల్ మిల్లు, రైస్ మిల్లు, ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం వంటివి పలు వాటిలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. షావాలెస్ భాగస్వామ్యంతో ప్రారంభించిన బ్రూవరీని, ఆ తర్వాత లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు అమ్మేశారు. తర్వాత చిన్న స్థాయిలో మొదలుపెట్టిన ఇన్సూరెన్స్ వ్యాపారాన్నిరహేజాలకు విక్రయించారు.

4. ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకు
వివిధ వ్యాపారాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న తర్వాత తన దగ్గర ఉన్న సంపదను ఒకేచోట ఉంచితే లాభం లేదని భావించారు. ఒక కొత్త దాంట్లో తన వద్ద ఉన్న డబ్బును పెట్టుబడి పెట్టాలని భావించారు. ఈ విధంగా ఐఎన్‌జీ భాగస్వామ్యంతో ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకును ప్రారంభించారు. బ్యాంకు ప్రారంభించేటప్పుడు ఐఎన్‌జీ వారు ఈయన్నే ఎందుకు ఎంచుకున్నారంటే వారికి ఆంధ్రా కోస్తా ప్రాంతం నుంచి వైశ్యా(వ్యాపార) వర్గం నుంచి ఒకరు కావాలి, వారికి విస్తృత పరిచయాలు ఉండాలి. ఆ విధంగా ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకు ప్రారంభమైంది. తర్వాత వివిధ కారణాల వల్ల ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకులో గ్రంథి మల్లికార్జున రావు తన వాటాను ఐఎన్‌జీకి అమ్మేసుకున్నారు.

5. టర్నింగ్ పాయింట్
1978లో ఓ చిన్న ఫ్యాక్టరీతో మొదలైన జీఎంఆర్ గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగింది. విమానాశ్రయాల నిర్మాణంతో పాటు విద్యుత్ రంగంలోనూ కాలుమోపింది. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలతో పాటు టర్కీ, మాల్దీవ్స్ దేశాల్లో కూడా విమానాశ్రయాలను నిర్మించింది. ఇదంతా అంత సులువుగా ఏం జరగలేదు. 1990ల్లో దేశంలో సరళీకరణ ప్రారంభమైంది. దాంతో పాటు చాలా మందికి అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో ఎల్ అండ్ టీ వంటి పోటీదారులను తట్టుకుని జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టును దక్కించుకుంది. అయితే విమానశ్రయ ప్రాజెక్టు అయితే చేతిలో ఉంది కానీ దానికి సంబంధించిన అనుభవం ఆయనకు, తన కంపెనీకి కానీ లేవు. అలాంటి సమయంలోనే తన మేథను ఉపయోగించారు. చాలా సమయాన్ని దాని గురించి నేర్చుకోవడంలో వెచ్చించారు. జర్మనీ, సింగపూర్, మలేసియా వంటి దేశాల నుంచి నిపుణులను రప్పించి తన ఉద్యోగులకు శిక్షణనిప్పించారు. ఆపసోపాలు పడి హైదరాబాద్ అంతర్జాతీయ విమానశ్రయాన్ని పూర్తిచేశారు.

6. బీపీవో నుంచి తప్పుకున్నారు
వివిధ వ్యాపారాలు విజయవంతంగా నడుస్తున్న సమయంలోనే దేశంలో ఉన్న ట్రెండ్‌ను బట్టి ఆయన మారారు. ఆ విధంగా బీపీవో ఔట్‌సోర్సింగ్ మీద జీఎంఆర్ కన్ను పడింది. అయితే ఐటీ రంగంలో చేసే వ్యాపారం విభిన్నంగా ఉండటంతో అక్కడ విజయం అంత సులువుగా చేతికి రాలేదు. కేవలం 7 లేదా 8 నెలల వ్యవధిలోనే దాన్ని ఐగేట్ కంపెనీకి అమ్మేశారు. ఈ విధంగా అక్కడ నుంచి నిష్క్రమించారు.

7. ఐటీ-బీపీవో తర్వాత మౌలిక రంగంలోకి
ప్రైవేటు రంగంలో రోడ్ల నిర్మాణానికి అప్పట్లో కేంద్రం అడుగులు వేస్తోంది. అప్పటి నిబంధనల ప్రకారం ఎన్‌హెచ్ఏఐ ఆరు రోడ్లను గుర్తించింది. అవన్నీ ప్రైవేటు నిధులతో నిర్మించి, తర్వాత నిధులను రాబట్టుకునే విధంగా ఉన్నాయి. మొదటి దశలో మూడు రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులను జీఎంఆర్ దక్కించుకుంది. నిర్మించు, నిర్వహించు, బదలాయించు తరహాలో యాన్యుటీ స్కీమ్ కింద వీటి నిర్మాణ రంగంలోకి జీఎంఆర్ దిగింది. నిర్మాణం మొదలైనప్పటి నుంచి 15 ఏళ్ల పాటు యాన్యుటీ తరహాలో ఎన్‌హెచ్ఏఐ దానికి అయిన ఖర్చును ఏటా కొంత మొత్తంలో అందజేస్తుంది.

8. శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయం
1999లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానశ్రయ నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ పేరెన్నికగన్న సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించింది. 26 కంపెనీలు ఆసక్తికనబరచగా కేవలం మూడే కంపెనీలు బిడ్లను వేశాయి. మలేసియన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ భాగస్వామ్యంతో జీఎంఆర్ సైతం బిడ్ వేసి ప్రాజెక్టును దక్కించుకుంది. విమానశ్రయాల నిర్మాణంతో పాటు విద్యుత్ రంగంలోనూ పలు ప్రాజెక్టులను దక్కించుకున్నారు. చాలా తక్కువ కాలంలోనే విద్యుత్ రంగంలో దేశవ్యాప్తంగా ఈ గ్రూప్ 13 ప్రాజెక్టులను చేపట్టింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మెప్పు పొంది మూడు గ్రీన్ ఫీల్డ్ పవర్ ప్లాంట్లను నిర్మించారు.

9. పలు ముఖ్య ప్రాజెక్టులు
- మొత్తం విద్యుత్ ప్రాజెక్టుల్లో కొన్ని హైడల్, కొన్ని థర్మల్ రంగంలోనూ ఉన్నాయి. ఇందులో మూడు నిర్వహణ దశలో ఉండగా, మిగిలిన 10 వేర్వేరు దశల్లో ఉన్నాయి.
- జాతీయ రహదారులకు సంబంధించి ఈ గ్రూప్ ఇప్పటికి 6 రోడ్డు ప్రాజెక్టులను పూర్తిచేసింది.
- విమానశ్రయాల ప్రాముఖ్యతను గుర్తించి ప్రపంచంలో వివిధ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాల్లో తనదైన చేయివేసింది.
- హైదరాబాద్‌లోని శంషాబాద్, ఢిల్లీలోని డయల్ టర్మినల్ 3 నిర్మాణాలను జీఎంఆర్ చేపడుతోంది.
- విదేశాల విషయానికి వస్తే టర్కీలోని ఇస్తాన్ బుల్ టర్మినల్‌ను జీఎంఆర్ నిర్మించింది.
- అదే విధంగా మాల్దీవుల్లోని మాలే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(ఎంఐఏ) ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని పూర్తిచేసింది.

10. జీఎంఆర్ సామాజిక బాధ్యత
ఎన్ని వ్యాపారాల్లో ఉన్న తనకు ఎంతో ఇచ్చిన సమాజాన్ని జీఎంఆర్ మరవలేదు. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ పేరిట ఒక సంస్థను స్థాపించి కార్పొరేట్ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఇది విద్యా, ఆరోగ్యం, పరిశుభ్రత, స్వచ్చత, మహిళా స్వయం సమృద్ది, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో పాటుపడుతోంది. తన కంపెనీ ఎక్కడ ఉంటే అక్కడ చుట్టుపక్కల సమాజ అభివృద్దికి మల్లికార్జున రావు పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆ విధంగా విశ్వవ్యాప్తంగా 22 ప్రదేశాల్లో ఈ ఫౌండేషన్ తరపున అభివృద్ది కార్యక్రమాలు సాగుతున్నాయి. మన దేశంలో ఆయన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో 10 రాష్ట్రాల్లో ఈ చాలా కార్యక్రమాలు అమలవుతున్నాయి. వీటన్నింటి కోసం సంస్థ పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తోంది.

మధ్యతరగతి ఈ 10 మార్గాల్లో పెట్టుబడి పెడితే సంపన్నులవ్వడం ఖాయం

పిల్లల కోసం ఆరు ఉత్తమ పొదుపు ఖాతాలు
