For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వడ్డీరేట్లు యథాతథం: అందుబాటులో 40వేల కోట్లు

|

RBI keeps repo rate unchanged at 8%; SLR cut by 50 bps
ముంబై: భారత రిజర్వు బ్యాంక్ మంగళవారం ప్రకటించిన ద్రవ్యవపరపతి విధాన ద్వైమాసిక సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. అయితే ద్రవ్యోల్బణం తగ్గితే రాబోయే సమీక్షల్లో వడ్డీరేట్లను తగ్గిస్తామన్న హామీని ఇచ్చింది. కాగా, కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్‌బిఐ ప్రకటించిన తొలి సమీక్ష ఇది. బ్యాంకులు ఆర్‌బిఐ వద్ద తప్పకుండా ఉంచాల్సిన నిధుల మోతాదు చట్టబద్ద ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్)ని మాత్రం 0.5 శాతం తగ్గించి 22.5 శాతానికి పరిమితం చేసింది.

జూన్ 14 నుంచి తగ్గింపు వర్తిస్తుందని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. ఫలితంగా 40,000 కోట్ల రూపాయల నిధులను బ్యాంకింగ్ రంగానికి అందించింది. ఇక ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఏప్రిల్ 1న జరిపిన ద్రవ్యసమీక్షలోనూ రాజన్ కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో రెపోరేటు 8 శాతం, రివర్స్ రేపోరేటు 7 శాతం వద్దే ఉన్నాయి. ఇక నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్) జోలికీ వెళ్లకుండా 4 శాతం వద్దే ఆర్‌బిఐ ఉంచింది.

ఆర్‌బిఐ తాజా ద్రవ్యసమీక్షపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. ఆర్‌బిఐ అన్ని అంశాలను బేరీజు వేసుకుని జాగ్రత్తగా వ్యవహరించే విధానాన్ని అవలంభించిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయం సరైనదేనని అన్నారు. సమీక్షపై రఘురాం రాజన్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి, వృద్ధిరేటు పెరిగితే వడ్డీరేట్ల పెంపుండదని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 5.5 శాతంగా ఉంటుందని తెలిపారు.

వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వచ్చే ఏడాది జనవరి నాటికి 8 శాతంగా, 2016 జనవరికల్లా 6 శాతంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం 8.59 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. ఇదిలావుంటే విదేశాల్లోని ఇండివిడ్యువల్స్ వార్షిక పెట్టుబడుల పరిమితిని 75,000 డాలర్ల నుంచి 1,25,000 డాలర్లకు పెంచుతూ ఆర్‌బిఐ నిర్ణయం తీసుకుంది.

అంతేగాక భారత్ నుంచి విదేశాలకు వెళ్లే సమయంలో పాకిస్థాన్, బంగ్లాదేశీయులు మినహా భారతీయులు, ఇతర దేశీయులు 25,000 రూపాయల మేర భారతీయ కరెన్సీని తమ వెంట తీసుకువెళ్లేందుకు ఆర్‌బిఐ అనుమతిచ్చింది. ప్రస్తుతం 10,000 రూపాయలు మాత్రమే భారతీయులు విదేశాలకు వెళ్లేటప్పుడు తీసుకెళ్లే అనుమతి ఉంది.

సమీక్షపై ఎవరేమన్నారు

ఆర్‌బిఐ నిర్ణయం ముందు ఊహించినట్లుగానే ఉంది. బడ్జెట్‌కు ముందు ఆర్‌బిఐ ఇలా వ్యవహరించడం సహజమేనని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు.

బడ్జెట్ అయ్యేంత వరకు వడ్డీరేట్ల విషయంలో తుది నిర్ణయం తగదు. వర్షాలు ఎలా పడతాయో తెలియదు కాబట్టి బడ్జెట్ తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవడం తెలివైన పనేనని ప్రధాని ఆర్థిక సలహా మండలి మాజీ ఛైర్మన్ రంగరాజన్ అన్నారు.

‘ఎస్‌ఎల్‌ఆర్‌ను తగ్గించడం శుభపరిణామం. ఈ చర్య బ్యాంకింగ్ రంగానికి నిధుల కొరతను తీర్చడమేగాక, కార్పొరేట్ రంగానికి మరిన్ని రుణాలను అందించేలా ప్రేరేపిస్తుంది' అని పారిశ్రామిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

‘ఆర్‌బిఐ తాజా ద్రవ్య విధానం నిరాశపరిచింది. గృహ నిర్మాణ రంగానికి చేయూతనిచ్చేందుకు వడ్డీరేట్ల తగ్గింపు అత్యవసరం. బ్యాంకింగ్ రుణాలు తగ్గేలా ఆర్‌బిఐ చర్యలుంటే బాగుండేది.' రియల్ ఎస్టేట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

‘తగ్గిన ఎస్‌ఎల్‌ఆర్ ప్రభావం వెంటనే ఉండబోదు. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబిస్తోంది' బ్యాంకింగ్ రంగం పేర్కొంది.

ఇది ఇలా ఉండగా ద్రవ్యోల్బణం ఇప్పట్లో తగ్గడం అంత సులువు కాదు. డిసెంబర్‌లో మరోమారు కీలక వడ్డీరేట్లను ఆర్‌బిఐ పెంచే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు.

English summary

వడ్డీరేట్లు యథాతథం: అందుబాటులో 40వేల కోట్లు | RBI keeps repo rate unchanged at 8%; SLR cut by 50 bps


 In line with market expectations, the Reserve Bank of India on Tuesday kept key rates unchanged. While the repo rate was maintained at 8% and reverse repo rate at 7%, the SLR was cut by 50 basis points.
Story first published: Wednesday, June 4, 2014, 10:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X