For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చక్కెర మిల్స్‌కు తీపికబురు: లాభాల్లో మార్కెట్లు

|

న్యూఢిల్లీ/ముంబై: చెరకు రైతులను, చక్కెర మిల్లులను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర మంత్రుల బృందం చక్కెర పరిశ్రమకు తీపికబురును అందించింది. చెరకు రైతులకు బకాయిలను చెల్లించేందుకు గాను చక్కెర మిల్లులకు బ్యాంకుల నుంచి 7,200 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ నియమించిన మంత్రుల బృందం శుక్రవారం సిఫారసు చేసింది. ఈ సొమ్ము మొత్తాన్ని చెరకు పంటను తెచ్చి అమ్మే రైతులకు మిల్లుల యాజమాన్యాలు చెల్లించాలని మంత్రుల బృందం షరతు విధించింది.

చెల్లింపుల సంక్షోభంలో కూరుకుపోయిన చక్కెర మిల్లులకు తోడ్పాటునందించే ఉద్దేశంతో ఈ రుణాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రుల కమిటీకి నేతృత్వం వహించిన వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని రైతులకు మిల్లులు నిరుడు చెల్లించాల్సిన బకాయిలే రూ. 3,400 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వ తాజా రుణ సాయంతో ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుందని మిల్లుల యాజమాన్యాలు భావిస్తున్నాయి.

Sharad Pawar

రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా మిల్లుల రుణాల పునర్ వ్యవస్థీకరణ, 40 లక్షల టన్నుల వరకు ముడి చక్కెర ఉత్పత్తిపై ప్రోత్సాహకాలు, నిల్వ చేసుకోవటం, పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ఐదు నుంచి పది శాతానికి పెంచటం వంటి కీలక సిఫారసులకు మంత్రుల బృందం అంగీకారం చెప్పింది. అయితే చక్కెరపై దిగుమతి సుంకాలను వెంటనే పెంచటం లేదని స్పష్టం చేసింది. చెరకు రైతుల బకాయిలను చెల్లించాలనే ఏకైక నిబంధనతో చక్కెర మిల్లులకు 7,200 కోట్ల రూపాయల రుణాలను అందించనున్నట్లు శరద్ పవార్ వెల్లడించారు.

చక్కెర పరిశ్రమను ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ బెయిల్ ఔట్ ప్యాకేజీని ప్రకటించినట్లు శరద్ పవార్ చెప్పారు. మొత్తం 12 శాతం వడ్డీ రాయితీలో 7 శాతం షుగర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్‌డిఎఫ్) నుంచి కేటాయించనుండగా ప్రభుత్వం ఐదు శాతం చెల్లించనుందని ఆయన తెలిపారు. మొత్తం ఐదేళ్ల కాలంలో ఈ రుణాలను మిల్లులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొదటి రెండేళ్లు రుణాల చెల్లింపుపై మారటోరియం ఉండనుందని, మంత్రుల బృందం తీసుకున్న సిఫారసులన్నింటిని వచ్చే రెండు వారాల్లో కేబినెట్ ముందుంచనున్నట్లు పవార్ వెల్లడించారు.

చక్కెర పరిశ్రమను గట్టెక్కించటానికి మంత్రుల బృందం సిఫారసు చేసిన బెయిల్ ఔట్ ప్యాకేజీని భారత చక్కెర మిల్లుల సమాఖ్య (ఇస్మా) డైరెక్టర్ జనరల్ అభినాష్ శర్మ స్వాగతించారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ రంగాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తోడ్పాడునందించేవిగా ఉన్నాయని అన్నారు.
కాగా మంత్రుల బృందం సిఫారసులతో స్టాక్ మార్కెట్లలో చక్కెర కంపెనీ షేర్లు దూసుకుపోయాయి. బిఎస్ఈలో శక్తి షుగర్స్ షేర్లు ఏకంగా 10.39 శాతం పెరగగా బజాజ్ హిందుస్తాన్ షేర్లు 5.46 శాతం పెరగగా, ద్వారకేష్ షుగర్స్ 4.96 శాతం, మవానా షుగర్ 4.98 శాతం, ధర్మపూర్ షుగర్ 4.96 శాతం, రేణుకా షుగర్స్ 4.27 శాతం, బలరాంపూర్ చినీ 2.56 శాతం మేర లాభపడ్డాయి.

స్వల్ప లాభాల్లో మార్కెట్లు

వారాంతం రోజు కూడా మార్కెట్‌కు ఒడిదుడుకులు తప్ప లేదు. ప్రారంభం నుంచే లాభ, నష్టాలతో కొనసాగిన సూచీలు చివరకు లాభాల్లోనే ముగిశాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించడమే ఒడిదుడుకులకు కారణమని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. బిఎస్ఈ సూచీ 38.72 పాయింట్లు పెరిగి 20,996.53 వద్ద, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 18.80 పాయింట్లు వృద్ధి చెంది 6,259.90 వద్ద నిలిచాయి. ప్రభుత్వరంగ సంస్థలతోపాటు కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, మెటల్, బ్యాంకింగ్‌రంగ షేర్లు మదుపర్లను అమితంగా ఆకట్టుకున్నాయి.

English summary

చక్కెర మిల్స్‌కు తీపికబురు: లాభాల్లో మార్కెట్లు | Sharad Pawar offers Rs 7,200-cr package for ailing sugar industry

An informal Group of Ministers, headed by Agriculture Minister Sharad Pawar, on Friday recommended a slew of incentives to the sugar industry, including 12 per cent-interest subsidy on Rs. 7,200-crore loan that mills can avail of from banks for paying cane farmers.
Story first published: Saturday, December 7, 2013, 11:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X