జగనన్న తోడు స్కీం: వడ్డీలేని రుణం.. 3 నెలలకోసారి ఖాతాల్లో, దరఖాస్తు ఎక్కడంటే?
అమరావతి: కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగాలపై ప్రభావం పడింది. చిరువ్యాపారులు, వీధివ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులు తీవ్రంగా దెబ్బతిన్నారు. వారికి అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పథకం ప్రారంభించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వీరికి ఉపశమనం కల్పించింది. అసంఘటిత రంగంలోని ఈ చిరు వ్యాపారులకు బ్యాంకుల నుండి రుణాలు అంత ఈజీ కాదు. దీంతో వీరు ప్రయివేటు వ్యక్తుల నుండి రూ.3 నుండి రూ.10 వరకు వడ్డీతో అప్పు తీసుకొని ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వీరికి అండగా ఉండేందుకు జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించింది.
మారుతున్న బ్యాంకు రూల్స్, డిసెంబర్ 2020 నుండి RTGS

వివిధ రంగాలవారికీ జగనన్న పథకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 'జగనన్న తోడు' పథకాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ పథకం కిందకు చిరు వ్యాపారులు, తోపుడు బండ్లపై విక్రయించేవారు, కూరగాయలు, వస్తువులు అమ్మేవారు, టిఫిన్ సెంటర్లు, ఇత్తడి పాత్రల తయారీదారులు, కలంకారీ పనులు చేసే వారికి.. ఇలా వివిధ రంగాల్లోని వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఇలా వివిధ రంగాల్లో ఉన్నవారు స్వయం ఉపాధి పొందడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు.

ఎంతమందికి ప్రయోజనం.. ఎలా
తొలి విడతగా దాదాపు 10 లక్షలమందికి రూ.1,000 కోట్ల రుణాలు మంజూరు చేశారు. వీటికి ప్రతి సంవత్సరం రూ.60 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు అయ్యే వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. వారం పది రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ మొత్తం రానుంది. ఇవి వడ్డీ లేని రుణాలు. అయితే ప్రభుత్వం 3 నెలలకు ఓసారి లబ్ధిదారుల ఖాతాల్లో వడ్డీ జమ చేస్తుంది. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 10 లక్షల మంది ఖాతాదారుల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. ఈ రూ.10వేలు వడ్డీ లేకుండానే రుణాలు అందిస్తున్నారు.

గడువులోగా చెల్లిస్తే ప్రయోజనం ఏమిటి, దరఖాస్తు ఎక్కడ?
వడ్డీలేని ఈ రుణాలు తీసుకున్న వారు గుర్తింపు కార్డులు తీసుకొని, ఏడాదిలోగా వీటిని చెల్లించాలి. ఈ రుణాలు గడువులోగా చెల్లిస్తే మళ్లీ రుణాలు తీసుకోవచ్చు. గడువులోగా చెల్లిస్తే మళ్లీ వడ్డీ లేని రుణాలే పొందడానికి అర్హులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసింది. అర్హులు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. వెరిఫికేషన్ పూర్తి కాగానే ఒకటి రెండు నెలల్లో పథకం అమలు చేస్తారు. ఏదైనా సమస్య ఉంటే 1902 నెంబర్‌కు ఫోన్ చేయాలి.