Gold prices today: బంగారం షాక్, రూ.1000 పెరుగుదల, కొంటారా.. వేచిచూడండి!
బంగారం ధర పరుగులు పెడుతోంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఈ వారం రూ.48,000 ప్రారంభమైన గోల్డ్ ఫ్యూచర్స్ ఈ నాలుగు సెషన్‌లలో రూ.49,000కు చేరువైంది. ముఖ్యంగా గత రెండు మూడు సెషన్‌లలోనే రూ.900కు పైగా పెరిగింది. దీపావళి-ధనతెరాస్ పండుగకు ముందు కాస్త శాంతించి, రూ.48,000 దిగువన ట్రేడ్ అయిన గోల్డ్ ఫ్యూచర్స్, పండుగ తర్వాత మరింత తగ్గుతుందని భావించిన వారికి షాకిస్తూ.. రూ.1000కి పైగా పెరిగింది. నిన్న ఓ సమయంలో బంగారం తగ్గినట్లుగానే కనిపించినప్పటికీ, అంతలోనే పరుగు పెట్టింది. తద్వారా కొద్ది నెలల తర్వాత గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,800 పైన ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా భారీగానే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నేడు కూడా పెరిగాయి. ఈ ప్రభావం మన మార్కెట్‌లోను ఉంటుంది.

బంగారం ధర ఎంత ఉందంటే?
ప్రస్తుతం ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధర రూ.49,000కు సమీపంలో ఉంది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు రూ.119.00 (0.24%) లాభపడి రూ.48973.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.104.00 (0.21%) ఎగిసి రూ.49175.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 1850 డాలర్లను దాటి పరుగు పెడుతోంది. నిన్న 1,848.30 డాలర్ల వద్ద ముగిసి, నేడు ప్రారంభంలోనే 1,851.90 వద్ద ఆరంభించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం గం.10.30 సమయానికి 3.65 (+0.20%) డాలర్లు లాభపడి 1,851.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో 1856 డాలర్ల సమీపానికి చేరుకుంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
సిల్వర్ ఫ్యూచర్ ధరలు కూడా భారీగానే పెరిగాయి. రూ.65,000కు దిగువన ఉన్న డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.66,000 డాలర్లకు చేరుకుంది. ఉదయం గం.10.30 సమయానికి డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.72.00 (0.11%) లాభపడి రూ.65950.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.99.00 (0.15%) ఎగిసి రూ.66789.00 వద్ద ట్రేడ్ అయింది. ఫ్యూచర్ సిల్వర్ ఓ సమయంలో రూ.66,100ను కూడా చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో 25 డాలర్ల సమీపానికి చేరుకుంది. నేటి సెషన్‌లో 24.642 - 24.878 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.

బంగారం మద్దతు ధర, నిరోధకస్థాయి
పండుగ తర్వాత బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఐదు నెలల గరిష్టాన్ని తాకాయి. జూన్ 15న స్పాట్ గోల్డ్ 1850 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ స్థాయికి చేరుకుంది.
కామెక్స్‌లో బంగారం మద్దతు ధర ట్రాయ్ ఔన్స్ 1832-1818 డాలర్లు, నిరోధకస్థాయి 1865 - 1880 డాలర్లు, వెండి మద్దతు ధర 24.50-24.30 డాలర్లు, నిరోధకస్థాయి 25.00-25.20 డాలర్లు.
ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్ మద్దతు ధర రూ.48700-48500, నిరోధకస్థాయి రూ.49150-49400, వెండి మద్దతు ధర రూ.65220-64800, నిరోధకస్థాయి రూ.66300-66700.
బంగారాన్ని రూ.48,450 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.49,200 టార్గెట్ ధరతో రూ.48,750 స్థాయిలో కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

కరెక్షన్ కోసం వేచి చూడవచ్చు
బంగారాన్ని కొనుగోలు చేయడానికి కరెక్షన్ (దిద్దుబాటు) కోసం వేచి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. గతవారం, ఈ వారం బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే త్వరలో ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని, కాబట్టి కొత్తగా కొనుగోలు చేయడానికి మంచి కరెక్షన్ కోసం వేచి చూడాలని అంటున్నారు. లేదా లాంగ్ పొజిషన్ బుక్ చేయాలని అంటున్నారు.