Gold: దుబాయ్‌లో డిస్కౌంట్‌కు లభిస్తున్న బంగారం.. అసలు కారణం ఇదే!
సాధారణంగా దుబాయ్ అంటేనే బంగారానికి పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అక్కడి నుంచే బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంటారు. అయితే ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు గోల్డ్ మార్కెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణల వల్ల దుబాయ్‌లో బంగారం నిల్వలు పేరుకుపోయాయి. దీంతో అక్కడ గోల్డ్ ధరలపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

ఎందుకు ఈ డిస్కౌంట్లు?
యుద్ధం కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో దుబాయ్ నుంచి ఇతర దేశాలకు బంగారాన్ని పంపడం కష్టంగా మారింది. సాధారణంగా బంగారాన్ని ప్యాసింజర్ విమానాల ద్వారా రవాణా చేస్తారు. కానీ ప్రస్తుతం విమాన రాకపోకలపై ఆంక్షలు ఉండటంతో, బంగారం అంతా దుబాయ్ లోనే ఉండిపోయింది. దీనివల్ల వ్యాపారులకు స్టోరేజ్ ఖర్చులు, ఇన్సూరెన్స్ భారంగా మారుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి అంతర్జాతీయ ధర కంటే దాదాపు 30 డాలర్ల వరకు తక్కువకే (డిస్కౌంట్) బంగారాన్ని విక్రయిస్తున్నారు.
రవాణా కష్టాలు , రిస్క్
చాలా మంది కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లు ఇవ్వడానికి భయపడుతున్నారు. ఎందుకంటే షిప్పింగ్ చార్జీలు , ఇన్సూరెన్స్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవేళ ఎక్కువ డబ్బులు చెల్లించి ఆర్డర్ ఇచ్చినా, అది సకాలంలో చేరుతుందనే గ్యారెంటీ లేదు. రోడ్డు మార్గంలో సౌదీ అరేబియా లేదా ఒమన్ వంటి దేశాలకు తరలించడం కూడా చాలా రిస్క్ తో కూడుకున్న పని. సరిహద్దుల్లో తనిఖీలు, భద్రతా కారణాల వల్ల వ్యాపారులు అటువైపు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు.
భారత్‌పై దీని ప్రభావం ఎలా ఉంటుంది?
మన దేశం దుబాయ్ నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. దుబాయ్‌లో సరఫరా నిలిచిపోవడంతో ప్రస్తుతం భారత మార్కెట్‌లో కొంత మేర కొరత కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే జనవరి నెలలో భారత్ భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంది, కాబట్టి ప్రస్తుతం మన దగ్గర తగినంత స్టాక్ ఉంది. కానీ ఈ యుద్ధ పరిస్థితి ఇలాగే మరికొన్ని నెలలు కొనసాగితే మాత్రం భారత మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది.
ముడి బంగారం సరఫరాలో ఆటంకాలు
కేవలం తయారైన బంగారమే కాకుండా, గనుల నుంచి వచ్చే ముడి బంగారం (Doré) సరఫరా కూడా దెబ్బతింది. భారతదేశంలోని అతిపెద్ద రిఫైనరీ అయిన MMTC-PAMP వంటి సంస్థలకు మధ్యప్రాచ్యం నుంచి రావాల్సిన ముడి సరుకు అందడం లేదు. వేరే మార్గాల ద్వారా తెప్పించుకుందామన్నా రవాణా ఖర్చులు 60 నుంచి 70 శాతం పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ మార్కెట్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications