వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర, రూ.49300 క్రాస్: ధరలు ఎలా ఉండవచ్చు?
బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీపావళి-ధనతెరాస్‌కు ముందు తగ్గిన పసిడి ధరలు, ఆ తర్వాత మాత్రం పరుగు పెడుతోంది. ఈ వారంలో రూ.1200కు పైగా పెరిగింది. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.49,000 క్రాస్ చేసి తొమ్మిది
నెలల గరిష్టానికి చేరుకుంది. హైదరాబాద్‌లో బంగారం చాలా నెలల తర్వాత బంగారం ధర రూ.50,000 దాటింది. గురువారం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.750కి పైగా పెరిగి రూ.50,100ను సమీపించింది. 22 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ.700 పెరిగి రూ.46,000కు వచ్చింది. అంతకుముందు 24 క్యారెట్ల పసిడి రూ.49,300, 22 క్యారెట్ల పసిడి రూ.45,200 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగి, ఫ్యూచర్ మార్కెట్ పైన, స్పాట్ మార్కెట్ పైన ప్రభావం పడింది.

కారణాలివే...
అమెరికాలో ద్రవ్యోల్బణం గత మూడు దశాబ్దాల్లో ఎన్నడు లేనంత ఈ అక్టోబర్ నెలలో 6.2 శాతం పెరిగిందనే వార్తల నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పుంజుకున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ పసిడి ధర అయిదు నెలల గరిష్టం 1,860 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది జూలై 21 తర్వాత పసిడి ఈ స్థాయికి చేరడం ఇది మొదటిసారి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్‌లో కూడా పసిడి భారీగా పెరిగి తొమ్మిది నెలల గరిష్టానికి చేరుకుంది. మరో కారణం ఏమంటే ప్రపంచ మార్కెట్లో పసిడి ధర పెరగడంతో పాటు ఇక్కడ రూపాయి వ్యాల్యూ 18 పైసలు తగ్గింది. దీంతో స్థానికంగా బంగారం ధర ఎక్కువగా పుంజుకున్నట్లు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం పెరిగినపుడు సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడి వైపు చూస్తారు ఇన్వెస్టర్లు.

బంగారం ధరలు ఇలా..
బంగారం ధరలు క్రితం సెషన్‌లో పెరిగాయి. ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.346.00 (0.71%) పెరిగి రూ.49200.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.309.00 (0.63%) పెరిగి రూ.49380.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న 1863.90 డాలర్ల పైన ముగిసింది. నేడు మాత్రం డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 6 డాలర్ల మేర తగ్గి 1858 డాలర్ల స్థాయిలో ఉంది. ఏడాదిలో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం మేర క్షీణించింది.
వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 67000కు చేరువైంది. నిన్నటి సెషన్‌లో రూ.1057 పెరిగి రూ.66,935 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,176.00 పెరిగి రూ.67866.00 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 25.301 వద్ద క్లోజ్ అయింది.

బంగారం మద్దతు ధర, నిరోధకస్థాయి
ఎంసీఎక్స్‌లో బంగారం నిరోధకస్థాయి రూ.49,370-49,880, మద్దత ధర రూ.48,250-48,000గా బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నిరోధకస్థాయి 1865 డాలర్లు. సిల్వర్ ఫ్యూచర్స్ నిరోధకస్థాయి 25.300-25.850 డాలర్లు, మద్దతు స్థాయి 24.150-23.500 డాలర్లు, ఎంసీఎక్స్‌లో నిరోధకస్థాయి రూ.67,000-రూ.68,160, మద్దతు ధర రూ.65,000 నుండి రూ.63,200.