Bank of Baroda Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలా, గుడ్‌న్యూస్, వడ్డీ రేట్లు మళ్లీ తగ్గింపు!
ప్రభుత్వరంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించింది. అయితే ఇది పరిమిత కాలమే. జూన్ 30వ తేదీ వరకు హోమ్ లోన్ వడ్డీ రేటును 6.50 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు హోమ్ లోన్ వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్‌ను బట్టి కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. గత కొద్ది నెలలుగా ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక వడ్డీ రేటు ఆఫర్ ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్యాంకు జనరల్ మేనేజర్ తెలిపారు.

వడ్డీ రేట్లు పెంచి, తగ్గించింది
కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి, అలాగే బ్యాలెన్స్ ట్రాన్సుఫర్‌కు కూడా కొత్త హోమ్ లోన్ వడ్డీ రేట్లు అందుబాటులో ఉంటాయి. సిబిల్ స్కోర్ 771కి పైగా ఉన్న వారికి దీనిని వర్తింపచేయనున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు 6.5 శాతమే వడ్డీ రేటు ఆఫర్ చేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ఏప్రిల్ 1వ తేదీ నుండి దీనిని 6.75%కి పెంచింది. ఇప్పుడు వెంటనే దీనిని పూర్వ వడ్డీ స్థాయికి తగ్గించింది.

మరిన్ని ప్రయోజనాలు
హోమ్ లోన్ వడ్డీ రేటును 6.50 శాతానికి తగ్గించడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు పైన 100 శాతం మినహాయింపు వర్తిస్తుంది. 'హోమ్ లోన్ విక్రయాలలో గత కొద్ది నెలలుగా పెరుగుదల కనిపిస్తోంది. సున్నా ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పరిమిత కాలానికి వడ్డీ రేటును 6.50 శాతానికి తగ్గించాం. కొనుగోలుదారులకు మరింత గడువు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. కస్టమర్లు తమ కలల ఇంటిని కొనుగోలు చేయడానికి ఇది ఆకర్షణీయ ఆఫర్. దీనిని ఉపయోగించుకోవాలి' అని బ్యాంకు జనరల్ మేనేజర్ (మోర్టగేజ్, ఇతర అసెట్స్) సోలంకి అన్నారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా పోర్ట్‌పోలియో
బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ పోర్ట్‌పోలియో ఏడాది ప్రాతిపదికన 6.57 శాతానికి పెరిగింది. డిసెంబర్ 2021 నాటికి ఇది రూ.76,898 కోట్లుగా నమోదయింది. అదనంగా గ్రాస్ రిటైల్ లోన్ పోర్ట్‌పోలియో డిసెంబర్ 2021 నాటికి 11.13 శాతం పెరిగి రూ.1,28,960 కోట్లకు పెరిగింది.