YouTube చేతికి దేశీయ వీడియో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ సిమ్‌సిమ్: బిగ్ డీల్
న్యూఢిల్లీ: దేశీయ వీడియో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ సిమ్‌సిమ్.. ఇక చేతులు మారనుంది. గుర్‌గావ్ ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను సాగిస్తోన్న ఈ స్టార్టప్ కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం యుబ్యూబ్ ప్రకటించింది. కొత్త కస్టమర్లకు మరింత చేరువ కావడానికి ఇలాంటి చిన్నతరహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను మరింత ప్రోత్సహించే క్రమంలో ఈ డీల్ కుదిరినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఎంత మొత్తానికి యుట్యూబ్ దీన్ని కొనుగోలు చేయనుందనే విషయం అధికారికంగా తెలియరాలేదు. అయినప్పటికీ- ఈ రెండు సంస్థల మధ్య కుదిరే కాంట్రాక్ట్..విలువ ఎంత బిలియన్ డాలర్ల కొద్దీ ఉండొచ్చని తెలుస్తోంది. తొలిదశలో 10 బిలియన్ల మేర పెట్టుబడులను పెట్టడానికి యుట్యూబ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
లోకల్ ప్రొడక్ట్‌కు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి ఏర్పాటు చేసిన చిన్నతరహా ఈ-కామర్స్ వీడియో ప్లాట్‌ఫామ్ ఇది. యాప్, అందులో పోస్ట్ అయ్యే వీడియోల ద్వారా స్థానిక ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులకు పరిచయం చేస్తుంటుంది. హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో ఈ వీడియోలు అందుబాటులో ఉంటోన్నాయి. రెండు సంవత్సరాల కిందటే ఇది ఏర్పాటైంది. అమిత్ బగారియా, కునాల్ సూరి, సౌరభ్ వశిష్ఠ దీన్ని నెలకొల్పారు. దీన్ని కొనుగోలు చేయడానికి యుట్యూబ్ ఆసక్తి చూపింది. యుట్యూబ్ చేతుల్లోకి వెళ్లిన తరువాత కూడా సిమ్‌సిమ్‌కు చెందిన యాప్ ఇండిపెండెంట్‌గానే పనిచేస్తుంటుందని యుట్యూబ్ యాజమాన్యం గూగుల్ తెలిపింది.

సిమ్‌సిమ్ అందజేసే ఆఫర్లు.. దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ యుట్యూబ్‌లో టెలికాస్ట్ అవుతాయని పేర్కొంది. దీనివల్ల సిమ్‌సిమ్ యూజర్లకు మరింత చేరువ అవుతుందని స్పష్టం చేసింది. ప్రొడక్ట్ జనంలోకి చొచ్చుకెళ్లడంలో వీడియోల పాత్ర కీలకంగా ఉంటోందని, అందుకే- యుట్యూబ్‌ను తాము సంప్రదించామని అమిత్ బగారియా, కునాల్ సూరి, సౌరభ్ వశిష్ఠ తెలిపారు. చర్చలు సఫలం కావడం సంతోషాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. యుట్యూబ్‌తో కలిసి పనిచేయాల్సి రావడం ఎగ్జయిటింగ్‌గా ఉందని వ్యాఖ్యానించారు. సాంకేతికంగా సిమ్‌సిమ్ ప్రొడక్ట్స్ యూజర్లకు మరింత చేరువ కావడానికి యూట్యూబ్ సహకరిస్తుందని స్పష్టం చేశారు.

రోజూ లక్షలాది మంది యూజర్లు యూట్యూబ్ ద్వారా తాము కొనుగోలు చేయదలిచిన ప్రొడక్ట్స్‌కు సంబంధించిన వీడియోలను తిలకిస్తుంటారని, అలాంటి వారికి సిమ్‌సిమ్ వీడియోలను అందజేస్తామని గూగుల్ తెలిపింది. భవిష్యత్తులో తొలిదశలో 10 బిలియన్ డాలర్లను సిమ్‌సిమ్‌లో పెట్టుబడిగా పెట్టనుంది యూట్యూబ్. దశలవారీగా తమ వాటాను పెంచుకుంటూ పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌లను కొనుగోలు చేసిన యూట్యూబ్ జాబితాలో తాజాగా సిమ్‌సిమ్ కూడా చేరింది. ఈ-కామర్స్ వీడియో ప్లాట్‌ఫామ్ స్టార్టప్‌లకు ఇది మరింత ఊతమిచ్చినట్టవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
