సైరస్ మిస్త్రీ అంశంపై సుప్రీం కోర్టు తీర్పు, రతన్ టాటా స్పందన
ముంబై: టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుండి సైరస్ మిస్త్రీని తొలగించడంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో తీర్పు తమకు అనుకూలంగా రావడంపై రతన్ టాటా స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు కృతజ్ఞతలు అని, ఇది గెలుపు ఓటములకు సంబంధించిన అంశం కాదని, తమ కచ్చితత్వం, తమ సంస్థ నైతిక ప్రవృత్తిపై నిర్దాక్షిణ్యంగా జరిగిన దాడి జరిగిందని, ఈ సమయంలో టాటా సంస్థ వాదనలు వాస్తవాలు అని ఈ తీర్పు వెల్లడిస్తోందని ట్వీట్ చేశారు.
అలాగే, టాటా సన్స్ పాటించే విలువలు, నైతికతకు ఈ తీర్పు అద్దం పట్టిందని, ఇవే మా సంస్థకు మార్గదర్శకాలు అని పేర్కొన్నారు. మన న్యాయవ్యవస్థలోని గొప్పతనాన్ని ఈ తీర్పు బలపరుస్తోందని పేర్కొన్నారు.

అయిదేళ్ల క్రితం(2016)లో సైరస్ మిస్త్రీని చైర్మన్‌గా తొలగిస్తూ టాటా సన్స్ తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు కాదని 2019 డిసెంబర్ 18వ తేదీన NCLT తీర్పు చెప్పింది. మిస్త్రీని తిరిగి చైర్మన్‌గా నియమించాలని ఆదేశించింది. 2020 జనవరి 2వ తేదీన టాటా సన్స్ ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.
అదే నెల 10వ తేదీన సుప్రీం కోర్టు ఎన్‌సీఎల్‌టీ తీర్పుపై స్టే విధించింది. 2020 సెప్టెంబర్ 22వ తేదీన టాటా సన్స్‌లోని షేర్లను షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ ఎక్కడా తాకట్టు పెట్టకుండా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత డిసెంబర్ 8వ తేదీన వాదనలు విన్నది. డిసెంబర్ 17న తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. నేడు టాటా సన్స్ వాదనలను బలపరుస్తూ తీర్పు వెలువరించింది.