Unacademy: ఆగని ఉద్యోగాల కోతలు.. 10 శాతం ఉద్యోగులు ఫసక్.. సీఈవో ఏమన్నారంటే..
Unacademy: దేశంలోని ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీలు నిజంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటికి తోడు ఇతర అనేక స్టార్టప్ కంపెనీలను కూడా నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ క్రమంలో చేసేది లేక కంపెనీల యాజమాన్యాలు వృద్ధి కంటే ఎక్కువగా ఖర్చులను తగ్గించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో వేలాది మందిని వరుసగా తొలగిస్తున్నాయి.

10 శాతం తొలగింపు..
ఎడ్‌టెక్ స్టార్టప్ అన్ అకాడమీ తన శ్రామికశక్తిలో 10 శాతం అంటే దాదాపు 350 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం స్టార్టప్ కంపెనీలు నిధుల కొరతను ఎదుర్కొంటుండగా ఖర్చులను తగ్గించుకునేందుకు హైరింగ్ ఫ్రీజ్‌లు, లేఆఫ్‌లను ఎంచుకుంటున్నాయి. జూలైలో అంతర్గత నోట్‌లో సీఈవో, సహ వ్యవస్థాపకుడు గౌరవ్ ముంజాల్ తొలగింపులు ఉండవని హామీ ఇచ్చినప్పటికీ తాజాగా ఉద్యోగుల తొలగింపు ప్రకటన వచ్చింది.

ఈ ఏడాది..
అన్ అకాడమీ స్టార్టప్ ఈ ఏడాది ఇప్పటి వరకు మెుత్తం ఉద్యోగుల్లో దాదాపు 50 శాతం మందిని తొలగించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో స్టార్టప్ ఏకంగా రూ.2,848 కోట్ల నష్టాన్ని నివేదించింది. దీంతో భారీగా ఖర్చులను తగ్గించే పనిలో పడింది యూనికార్న్. నెలవారీ నగదు ఖర్చును రూ.200 కోట్ల నుంచి రూ.50-60 కోట్లకు తీసుకురావాలని కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది. మార్కెట్ సవాళ్ల కారణంగా కంపెనీ తన నిర్ణయాలను పునఃపరిశీలించవలసి వచ్చిందని ముంజాల్ తెలిపారు.

మాట తప్పటంపై..
గతంలో ఇక ఉద్యోగుల తొలగింపు ఉండదని మాట ఇచ్చి ఇప్పుడు ఆ ప్రకటన నుంచి వెనక్కు వెళ్లినందుకు గౌరవ్ ముంజాల్ క్షమాపణలు చెప్పారు. ఖర్చులను తగ్గించుకునేందుకు కేవలం నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవటం మాత్రమే సరిపోదని.. ఫండింగ్ గణనీయంగా మందగించినందున కంపెనీ ప్రధాన వ్యాపారంలో ఎక్కువ భాగం ఆఫ్‌లైన్‌లోకి తరలించబడిందని ముంజాల్ పేర్కొన్నారు.

తొలగించిన ఉద్యోగులు..
కంపెనీ వరుసగా రెండో ఏడాది నష్టాలను చవిచూస్తుండడంతో ఈ తరహా ఖర్చు తగ్గించే చర్యలు తీసుకుంటోంది. అయితే.. తొలగించబడిన ఉద్యోగులకు నోటీసు పిరియడ్ తో పాటు రెండు నెలలకు సమానమైన వేతనాన్ని కంపెనీ చెల్లిస్తోంది. దీనికి తోడు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్, కెరీర్ సపోర్ట్‌తో సహా ప్రయోజనాలు కూడా కంపెనీ అందిస్తోంది.