విమానంలో కూర్చుని కాదు, నిలబడి ప్రయాణం...! త్వరలో రూ.500 తక్కువకే ఫ్లయిట్ టికెట్స్..
ఖరీదైన విమాన టిక్కెట్ల వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే, మీ సమస్యకు త్వరలోనే ఒక విచిత్రమైన పరిష్కారం దొరకవచ్చు. బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులు సీటుపై కూర్చోకుండా సగం కూర్చుని, సగం నిలబడి తక్కువ దూరం ప్రయాణించేలా ఒక కొత్త మార్గాన్ని రూపొందిస్తున్నాయి. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఈ వినూత్న సీట్లపై స్పందించారు.

హర్ష్ గోయెంకా ఏమన్నారు అంటే : హర్ష్ గోయెంకా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' (గతంలో ట్విట్టర్)లో అలాంటి సీటు గురించి పోస్ట్ చేస్తూ, త్వరలో విమానయాన సంస్థలు ప్రయాణికులు నిలబడి ప్రయాణించే సీట్లను తీసుకురాబోతున్నాయని రాశారు. కొన్ని బడ్జెట్ ఎయిర్‌లైన్స్ దీన్ని ప్లాన్ చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఇలాంటి సీట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ విమానయాన సంస్థలు ఎక్కువ మంది ప్రయాణీకులను చౌక టిక్కెట్లపై ప్రయాణించేలా చేయాలనుకుంటున్నాయి అంటూ పోస్ట్ చేసారు.
హర్ష్ గోయెంకా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోతో పాటు, "త్వరలో నిలబడి ప్రయాణించడానికి ఎయిర్‌లైన్ సీట్లు రాబోతున్నాయి. ఎయిర్‌లైన్స్ ఇప్పుడు మరిన్ని ప్రయాణీకులను నింపడానికి సన్నాహాలు చేస్తున్నాయి. 2026 నాటికి 20% ఎక్కువ మందిని కలిసి తీసుకెళ్లాలని వారు కోరుకుంటున్నారు. దీని కోసం 'సాడిల్ సీట్లు' ఉపయోగిస్తారు. ఈ సీట్లు తక్కువ దూర విమానాలలో ఉంటాయి ఇంకా టిక్కెట్లు కూడా చౌకగా ఉంటాయి. కానీ సౌకర్యం తక్కువగా ఉంటుంది, కాళ్ళు పేట్టుకోవడానికి ఫ్రీ స్థలం ఉండదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ సీట్లను ఏమని పిలవాలి? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
ఏయే విమానయాన సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి: డైలీ మెయిల్‌లోని ఒక నివేదిక ప్రకారం, 'కుడ్ ఎయిర్‌లైన్స్' 2026 నాటికి విమానాలలో ఇలాంటి సీట్లను ఏర్పాటు చేయబోతోంది. ఈ సీట్లకు స్కైరైడర్ 2.0 అని పేరు పెట్టనుంది. ఈ సీట్లు బైక్ లాగా ప్యాడ్ చేయబడి ఉంటాయి. ప్రయాణీకులు పూర్తిగా కూర్చోకుండా కొద్దిగా వంగి ఈ సీట్లపై కూర్చోగలుగుతారు. ఈ రకమైన సీటు అన్ని భద్రతా పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిందని నివేదికలో చెబుతోంది. అయితే, వీటిని రెండు గంటల వరకు ఉండే చిన్న విమానాలకు మాత్రమే ఉపయోగిస్తారు.
పాత ఆలోచనకు కొత్త రూపం, ఛార్జీ ఎంత: డైలీ మెయిల్ నివేదిక ప్రకారం, స్కైరైడర్ 2.0ని తొలిసారిగా 2018లో హాంబర్గ్‌లో జరిగిన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ఎక్స్‌పోలో ప్రవేశపెట్టారు. దీనిని తయారు చేసింది ఇటాలియన్ కంపెనీ ఏవియో ఇంటీరియర్స్. ఈ సీటును 2010లో కూడా ప్రవేశపెట్టారు, కానీ అప్పుడు అది అంతగా విజయవంతం కాలేదు. ఇప్పుడు ఆ కంపెనీ దానిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దింది.
రైనయిర్ ఎయిర్‌లైన్స్ సీఈఓ మైఖేల్ ఓ'లియరీ మాట్లాడుతూ నిలబడి ప్రయాణించే టికెట్ ధర 1 పౌండ్ నుండి 5 పౌండ్ల వరకు ఉంటుందని, అంటే దాదాపు రూ.100 నుండి రూ.500 వరకు ఉంటుందని అన్నారు. అయితే, చాలా మంది ఇలాంటి సీట్ల గురించి ఆందోళన చెందుతున్నారు. విమానయాన పరిశ్రమలోని వ్యక్తులు ఈ సీట్లు సౌకర్యవంతంగా ఉండవని, అత్యవసర సమయంలో సురక్షితంగా ఉండవని అంటున్నారు. కానీ, బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఈ సీట్లకు సీట్ బెల్టులు ఉంటాయని, అవి అన్ని భద్రతా నియమాలను పాటిస్తాయని చెబుతున్నాయి.