Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు పెద్ద ఊరట.. సెబీ గ్రీన్ సిగ్నల్.. సంతోషంలో షేర్ హోల్డర్స్..
Vodafone Idea: రిలయన్స్ జియో అరంగేట్రం నుంచి వరుస కష్టనష్టాలను ఎదుర్కొని నిలబడేందుకు ప్రయత్నిస్తోంది టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా. వేల కోట్లు నష్టాలు వస్తున్నా.. వెనకడుగు వేయకుండా కంపెనీని నిలబెట్టుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల భారాన్ని తగ్గించుకునేందుకు తాజాగా సెబీ అనుమతించింది.

సంతోషంలో ఇన్వెస్టర్లు..
కొన ఊపిరితో ఉన్న టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియాకు 1.92 బిలియన్ డాలర్ల బకాయిల భారాన్ని తగ్గించుకునేందుకు అవకాశం లభించింది. కేంద్రానికి ఉన్న బకాయిలను ఈక్విటీగా మార్చుకునేందుకు క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

రెస్క్యూ ప్యాకేజ్..
అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీల కోసం ఒక రెస్క్యూ ప్యాకేజీని గత సంవత్సరం భారత ప్రభుత్వం ఆమోదించింది. ఇది ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాయిదా వేసిన సర్దుబాటు చేయబడిన స్థూల ఆదాయంపై వడ్డీని ఈక్విటీగా మార్చడానికి వీలు కల్పించింది. ఈ ప్యాకేజ్ దివాళా అంచున ఉన్న వోడఫోన్ ఐడియా కంపెనీకి బెయిలౌట్‌గా భావించవచ్చు.

ప్రభుత్వం పాత్ర..
కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇన్వెస్టర్‌గా రావాలన్న ప్రతిపాదనను సెబీ ఆమోదం పొందింది. ఈ విషయం టెలికాం మంత్రిత్వ శాఖకు తెలియజేయబడింది. ఈ కన్వర్షన్ తర్వాత వోడాఫోన్‌లో ప్రభుత్వ వాటా 30% కంటే ఎక్కువగా ఉండనుంది. కంపెనీలో కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా అవతరించనుంది. కంపెనీ తిరిగి గాడిన పడిన తర్వాత ప్రభుత్వం తన వాటాలను విక్రయిస్తుందని ఒక అధికారి వెల్లడించారు.

ఆనందంలో ఇన్వెస్టర్లు..
ప్రభుత్వ నిర్ణయానికి అనుంతి లభించటంతో వోడాఫోన్ ఐడియా ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. చాలా మంది రిటైలర్లు ఈ పెన్నీ స్టాక్ లో భారీగా పెట్టుబడులు పెట్టారు. అయితే కంపెనీని కాపాడేందుకు కేంద్రం సహకరించటంతో వారి పెట్టుబడి విలువ రానున్న కాలంలో మరింత పెరుగుతుందని వారు భావిస్తున్నారు. షేర్ ధర భారీగా పెరగవచ్చని ఆశాజనకంగా ఉన్నారు. కంపెనీని కాపాడేందుకు కుమార మంగళం బిర్లా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది.