ఏడాది చివరి నాటికి డాలర్ మారకంతో రూపాయి 81కి చేరే అవకాశం
విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ నుండి వరుసగా నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ భారీగా పతనమవుతోంది. గత మూడు నాలుగు రోజులుగా డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి భారీగా పడిపోయి, 78 సమీపానికి పడిపోయింది. బుధవారం ఒక్కసారిగా 19 పైసలు క్షీణించింది. దీంతో 78.32 వద్ద ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది.
ఇంటర్ బ్యాంకు ఫారెన్ ఎక్స్చేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో 78.13 వద్ద ప్రారంభమై, ఆ తర్వాత క్రమంగా క్షీణించి 78.40 స్థాయికి కూడా పడిపోయింది. చివరకు 78.32 వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ నేడు మాత్రం కాస్త కోలుకుంది. నేడు ప్రారంభ సెషన్‌లో 9 పైసలు లాభపడింది. అమెరికా వడ్డీ రేట్లు పెరగడం, అంతర్జాతీయ ద్రవ్యోల్భణ అంశాలు డాలర్ మారకంతో రూపాయి పైన ప్రభావం చూపుతాయి.

అయితే రూపాయి మరింత క్షీణించి ఈ ఏడాది చివరి నాటికి డాలర్ మారకంతో పోలిస్తే 81కి పడిపోవచ్చునని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పెరుగుతున్న చమురు ధరలు, మౌలిక సదుపాయాల ధరల పెరుగుదల వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయని, దీంతో రూపాయి 81ని తాకవచ్చునని బ్యాంక్ ఆఫ్ అమెరికా (BoFA) పేర్కొంది.