బ్యాంకులకు షాక్, ATMలలో నగదు లేకుంటే జరిమానా, ఎప్పటి నుండి అంటే?
వైట్ లేబుల్ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్(ATM)లలో నగదు లేకుంటే అక్టోబర్ 1వ తేదీ నుండి కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జరిమానా విధించనుంది. ఏటీఎంలలో నగదు కొరతపై కేంద్ర బ్యాంకు తీవ్రంగా స్పందించింది. ATMలలో నగదు లేకుంటే ఆ బ్యాంకు పైన, ఏటీఎం ఆపరేటర్స్ పైన రూ.10,000 చొప్పున జరిమానా వేస్తామని ప్రకటించింది. ఖాళీ ATMలు బ్యాంకు ఖాతాదారులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ మేరకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో ఆర్బీఐ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీ నుండి ఏటీఎంలలో నగదును ఎప్పటికప్పుడు నింపాల్సిందేనని, లేదంటే జరిమానా ఎదుర్కోవాలని తాజాగా విడుదల చేసిన ఓ సర్క్యులర్‌లో పేర్కొంది.

ఏటీఎంలపై జరిమానా
నెలలో పది గంటలకు పైగా ఏ ATMలో నగదు లేకపోయినా రూ.10,000 జరిమానా విధిస్తామని, ఇలా ఎన్ని ATMలు ఖాళీగా ఉంటే రూ.10,000 చొప్పున అన్ని జరిమానాలు తప్పవని ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. ATMల ద్వారా ప్రజలకు నగదు అందాలని, అందుకు సరిపడా నగదును ATMలలో ఉండేలా చూడాలని, ఈ ప్రక్రియ సజావుగా సాగడానికే ఖాళీ ATMలపై ఈ జరిమానాలను తెస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ మేరకు నగదు నిల్వలు లేని ATMలపై జరిమానా పథకంను ప్రవేశ పెట్టామని తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ నుండి ఈ పథకం అమలులోకి వస్తుందని వెల్లడించింది. కాబట్టి బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు ఏటీఎంలలో నగదు నిల్వల్ని పర్యవేక్షించుకోవాలని హితవు పలికింది. ఏటీఎం నుండి ఖాతాదారు నగదు ఉపసంహరించుకోలేకపోయిన సమయం నుండి నగదును తిరిగి నింపే వరకు నో క్యాష్ టైమ్‌గా పరిగణిస్తామని తెలిపింది.

వైట్ లేబుల్ ఆపరేటర్లకు కూడా
వైట్ లేబుల్ ATMల విషయంలో బ్యాంకులకు పెనాల్టీ ఉండనుంది. అయితే బ్యాంకులు సదరు ATM ఆపరేటర్ నుండి ఈ జరిమానా మొత్తాన్ని వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది. అంటే బ్యాంకులతో పాటు వైట్ లేబుల్ ATM ఆపరేటర్లకు కూడా ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది.

వీరికి అధికారం
ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఇష్యూ డిపార్టుమెంట్‌లో ఇంచార్జ్ ఆఫీసర్ వారి పరిధిలోని ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకుంటే జరిమానా విధించవచ్చునని ఆర్బీఐ తెలిపింది. ఈ ఏడాది జూన్ చివరి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 2,13,766 ఏటీఎంలున్నాయి.
ప్రయివేటురంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు ఇటీవల కార్డు లేకుండానే ఏ బ్యాంకు కస్టమర్ అయినా ఏటీఎం నుండి నగదు తీసుకునే వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న 15 వేల ఏటీఎం కేంద్రాలలో రూ.20 వేలకు మించకుండా కార్డ్ లేకుండానే నగదును తీసుకోవచ్చునని ఇటీవల తెలిపింది. ఐమొబైల్ (iMobile) యాప్ నుంచి రిక్వెస్ట్ పెట్టడం ద్వారా ఈ కార్డ్‌లెస్ ఉపసంహరణ సేవలను వినియోగించుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ఈ సేవలను మంగళవారం నాడు ప్రారంభించింది. రోజుకు రూ.20,000 ఈ పద్ధతి ద్వారా తీసుకోవచ్చు. ఐమొబైల్‌కు విజ్ఞప్తి ద్వారా దేశంలోని పదిహేను వేల ఏటీఎం కేంద్రాలలో ఈ నగదు తీసుకోవచ్చు. ఇది అత్యంత సులువైన, సౌకర్యవంతమైన మార్గమని ఐసీఐసీఐ తెలిపింది.