Digital Rupee: నవంబర్ 1 నుంచి డిజిటల్ రూపీ.. ప్రైలట్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్న RBI
Digital Rupee: భారత ప్రభుత్వ డిజిటల్ కరెన్సీ కలలు వాస్తవ రూపం దాల్చుతోంది. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 1, 2022 నుంచి ప్రయోగాత్మకంగా నిర్దిష్ట వినియోగ కేసుల కోసం డిజిటల్ రూపీ పైలట్ లాంచ్‌లను ప్రారంభించనున్నట్లు RBI వెల్లడించింది.

తొలిదశ ప్రారంభం..
ముందుగా డిజిటర్ రూపీ చెల్లింపులను తొలిదశలో హోల్‌సేల్ విభాగంలో వినియోగించనున్నట్లు రిజర్వు బ్యాంక్ సోమవారం తన ప్రకటనలో వెల్లడించింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ సహా తొమ్మిది బ్యాంకులు పైలట్‌లో పాల్గొంటాయని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.

ప్రభుత్వ సెక్యూరిటీలు..
ప్రభుత్వ సెక్యూరిటీల్లో సెకండరరీ లావాదేవీల సెటిల్ మెంట్ కు ఈ పైలట్ ప్రాజెక్ట్ వినియోగించనున్నారు. ఇది ఇంటర్ బ్యాంక్ మార్కెట్ ను మరింత సమర్థవంతంగా చేయగలదని రిజర్వు బ్యాంక్ అధికారి వెల్లడించారు. అంటే రెండు వేరువేరు బ్యాంకుల మధ్య చెల్లింపులు మరింత వేగవంతం అవనున్నాయి. ఇది లావాదేవీల ఖర్చులను సైతం తగ్గించటానికి తోడ్పడుతుందని తెలుస్తోంది.

ఇతర దేశాలతో చెల్లింపులు..
డిజిటర్ రూపీ రానున్న కాలంలో ఇతర హోల్‌సేల్ లావాదేవీలు, క్రాస్-బోర్డర్ చెల్లింపుల అమలుకు ప్రస్తుత పనితీరు పర్యవేక్షణ ఉపకరిస్తుందని రిజర్వు బ్యాంక్ వర్గాలు భావిస్తున్నాయి. వీటి నుంచి నేర్చుకున్న వాటి ఆధారంగా ఈ విభాగాల్లో భవిష్యత్ పైలట్ నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉంటుందని వారు భావిస్తున్నారు.

రిటైలర్లకు..
రిటైల్ విభాగంలో పైలట్ సెటిల్ మెంట్ ప్రక్రియను మరో నెలరోజుల్లో ప్రారంభిస్తామని రిజర్వు బ్యాంక్ తెలిపింది. దీనిని సైతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో; కొన్ని కస్టమర్లు, వ్యాపారుల క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌లలో ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు.