పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ షాకిస్తాయా? అప్పటికి మరో రూ.100?
ఇటీవలి వరకు ఆకాశాన్ని అంటిన పెట్రోల, డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో వినియోగదారులకు కాస్త ఊరటను ఇచ్చాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీనికి తోడు పలు రాష్ట్రాలు కూడా సామాన్యుడిపై భారం తగ్గేలా నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రానికి తోడు తొమ్మిది బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ పైన రూ.7 చొప్పున తగ్గించాయి. దీంతో చాలాచోట్ల డీజిల్ రూ.100 దిగువకు వచ్చింది.
పెట్రోల్ కూడా కొన్ని ప్రాంతాల్లో రూ.100కు దిగి వచ్చింది. అయితే చమురు ధరలు ప్రస్తుతం తగ్గినప్పటికీ, మున్ముందు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఉపశమనం తాత్కాలికమేనని ఇంధన రంగ నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుదల ఉంటుందని, దీంతో దేశీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

రూ.100 పెరగవచ్చు
దేశీయ అవసరాల్లో భారత్ 86 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఇంధన ధరల నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో ఉండదని గుర్తు చేశారు. అంతర్జాతీయస్థాయిలో డిమాండ్-సరఫరాకు అనుగుణంగా ధరలు మారుతుంటాయని చెబుతున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరగడానికి కరోనా సంక్షోభం కారణమన్నారు.
డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోతే ధరలు పెరుగుతాయని గుర్తు చేస్తున్నారు. అలాగే చమురు రంగంపై ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకపోవడం కూడా ధరలు ప్రభుత్వాల చేతిలో ఉండకపోవడానికి ఓ కారణమన్నారు. కేవలం పునరుత్పాదక, హరితఇంధనంపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ధరలు మరింత పెరిగి, 2023 నాటికి లీటర్ ముడి చమురు మరో రూ.100 పెరగవచ్చునని అంటున్నారు.

అందుకే తగ్గింది
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు కనిష్ఠానికి చేరినప్పుడు కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచి ఆదాయాన్ని సమకూర్చుకుందే. అంతర్జాతీయంగా ధరలు పెరిగి, ఇక్కడ కూడా పెరగడంతో సామాన్యులపై భారం పడకుండా కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. కొద్ది నెలలుగా జీఎస్టీ వసూళ్లు ఆర్థిక పునరుద్ధరణను సూచిస్తున్నాయి. జీఎస్టీ వసూళ్లు పెరిగి, ఖజానాపై ఒత్తిడి తగ్గడంతో ఎక్సైజ్ సుంకం తగ్గింది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలనే వాదన చాలా రోజులుగా ఉంది.

ధరలు ఇలా..
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 103.97, లీటర్ డీజిల్ ధర 86.67, ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 109.98, డీజిల్ ధర 94.14, చెన్నైలో పెట్రోల్ ధర 101.40, డీజిల్ ధర 91.43, కోల్‌కతాలో పెట్రోల్ ధర 104.67, డీజిల్ ధర 89.79, భోపాల్‌లో పెట్రోల్ ధర 112.56, డీజిల్ ధర 95.40, హైదరాబాద్‌లో డీజిల్ రూ.94.62, లీటర్ పెట్రోల్ రూ.108.20గా ఉంది.